విభజన అనివార్యం అయిన సమయంలో కూడా, చివరి బంతి ఉంది, సిక్సర్ కొడతాం అంటూ, సమైక్యవాదం వినిపించిన, కిరణ్ కుమార్ రెడ్డి, తిరిగి సొంత గూటికి చేరారు. శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో కిరణ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధి, కిరణ్ ను పార్టీలోకి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నకిరణ్కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరనున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు కిరణ్ కుమార్‌రెడ్డితో భేటీ కావడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అందరి అంచనాలను నిజం చేస్తూ ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. అయితే, ఇప్పుడు లంఛనంగా మాత్రమే రాహుల్ ను కలిసారని, ఆంధ్రప్రదేశ్‌లో భారీ సభ ఏర్పాటుచేసి అక్కడ రాహుల్ సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్ లో చేరతరానికి, పార్టీ వర్గాలు అంటున్నాయి.
అయితే ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడిన మాటలు చూస్తుంటే, పాత కాంగ్రెస్ నేతలందరినీ, కాంగ్రెస్ లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారనే సంకేతాలు వస్తున్నాయి. ఆయన మెయిన్ టార్గెట్ జగన్ మోహన్ రెడ్డే అని చెప్పకనే చెప్పారు. దానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. జగన్ పై, సోనియా గాంధీ మొదటి నుంచి కోపంగానే ఉన్నారు. జైలు నుంచి బెయిల్ తీసుకునే దాకా, మా చుట్టూతా తిరిగి, మేము ఇబ్బందుల్లో ఉన్న టైంలో మోడీ పంచన చేరాడనే కోపం వారికి ఉంది. జగన్ ను దెబ్బతియ్యటానికి ఓర్పుగా ఎదురు చూస్తూ వచ్చారు. వారికి కిరణ్ కుమార్ రెడ్డి రూపంలో అవకాశం వచ్చింది. కాంగ్రెస్ గెలుపు అనేది కుదిరే పని కాదనే విషయం వారికీ తెలుసు. జగన్ ను ఇబ్బంది పెట్టటమే వాళ్ళ టార్గెట్. ఇదే విషయం ఈ రోజు కిరణ్ చెప్పకనే చెప్పారు..
కాంగ్రెస్ పార్టీతో అనుబంధం గురించి చెప్పారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న అనుబంధం గురించి చెప్పారు. తెలంగాణా ఇస్తాం అని చెప్పిన కాంగ్రెస్, తెలంగాణా ఇచ్చిందని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పామని, అది ఇచ్చి తీరుతామని అన్నారు. వైఎస్‌కు అత్యంత సన్నిహితుడిని అని, మా అందరికీ అప్పట్లో వైఎస్ చెప్పింది, రాహుల్ గాంధీని ప్రాధాన మంత్రిని చెయ్యటమే అనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అంతే కాదు, అసలు కధ ఇక్కడే ఉంది. త్వరలోనే కాంగ్రెస్ వీడిన 30-40 మంది నేతలను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఎక్కువ మంది కాంగ్రెస్ నాయకులు, జగన్ పార్టీతో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కిరణ్ రాకతో, ఓట్లు చీలిపోతాయని టెన్షన్ లో పడిన జగన్, ఇప్పుడు కిరణ్ చెప్తున్న మాటలతో, మరింతగా డైలమాలో పడినట్టే. మొత్తానికి, జగన్, పవన్, కాంగ్రెస్, ఇలా అందరూ కలిసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు కోసం, పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ ఎంత ప్రయత్నం చేసినా, రాష్ట్రంలో మళ్ళీ పుంజుకునే అవకాశం లేదు. అదే సమయంలో కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు మాత్రం, జగన్ కు ఇబ్బంది చేకూరుస్తాయనేది వాస్తవం... కిరణ్ ఎంట్రీ, జగన్ కు ఎలాంటి ఇబ్బంది అనేది కాలమే నిర్ణయిస్తుంది.