చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో ప్రతిష్టాత్మక టాటా అనుబంధ పరిశ్రమ ఏర్పాటవుతోంది. రూ.480 కోట్ల పెట్టుబడితో మెస్సర్స్ స్మార్ట్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ స్థాపిస్తున్న ఈ యూనిట్లో రెడీమేడ్ ఆహార పదార్థాలను తయారు చేస్తారు. అల్ట్రా మెగా ప్రాజెక్టు కింద చేపడుతున్న ఈ పరిశ్రమ ప్యాకేజ్ ఫుడ్స్ రంగంలో ఆర్టీఈ టెక్నాలజీని వినియోగించబోతున్న తొలి యూనిట్గా దేశంలోనే ప్రత్యేకతను సంతరించుకోనుంది. సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని శ్రీసిటీ ఎస్-ఈ-జడ్ లో టాటా అనుబంధ సంస్థ మెస్సర్స్ స్మార్ట్ ఫుడ్స్ లిమిటెడ్ రెడీ టూ ఈట్ ప్యాకేజ్ ఫుడ్స్ తయారీ పరిశ్రమ నెలకొల్పడానికి ముందుకొచ్చింది. రూ.480 కోట్ల పెట్టుబడితో అన్ని విభాగాలతో కూడిన సమగ్ర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పుతామని ప్రకటించింది.
రెడీమేడ్ ఆహార పదార్థాల తయారీకి సంబంధించి ఆర్టీఈ ఆధారిత టెక్నాలజీని దేశంలోనే తొలిసారిగా ఇక్కడే వినియోగంలోకి తెస్తామని స్పష్టం చేసింది. అద్వితీయ టెక్నాలజీగా పరిగణిస్తున్న మ్యాట్స్ (మైక్రోవేవ్ అసి స్టెడ్ థర్మల్ స్టెరిలైజేషన్) ఆధారంగా తయారయ్యే ఇక్కడి ఆహార పదార్థాలు ఎక్కువకాలం నిల్వ ఉంటాయని వివరించింది. ప్లాంటులో భాగంగా ఆర్టీఈ యూనిట్, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్, కోల్డ్ చెయిన్ యూనిట్, బిజినెస్ ఎక్స్లెన్స్ సెంటర్, టెస్టింగ్ లేబొరేటరీ తదితర ఐదు వేర్వేరు యూనిట్లు నెలకొల్పుతామని తెలియజే సింది. తొలి ఏడాది 280 మందికి ప్రత్యక్షంగా, 520 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్మార్ట్ ఫుడ్స్ సంస్థ యాజమాన్యం హామీ ఇచ్చింది.
తర్వాత పదేళ్లలో 430 మందికి ప్రత్యక్షంగానూ, 820 మందికి పరోక్షంగా ఉపాధి అందించే అవకాశముందని పేర్కొంది. పూర్తిస్థాయి పరిశ్రమకు అనువైన స్థలం కేటాయించాలని, అలాగే వివిధ రకాల రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. పరిశీలించిన స్టేట్ ఇన్ వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు సానుకూలంగా ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆ మేరకు శ్రీసిటీలో 24 ఎకరాల భూమిని కేటాయించిన ప్రభుత్వం ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2015-20కి అనుగుణంగా రాయితీలు ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ జిల్లాలో పలు జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు వచ్చినా దేశీయంగా తొలి పారిశ్రామిక సంస్థగా ప్రజల నోళ్లలో నిరంతరం నానుతుండే టాటా పరిశ్రమలకు సంబంధించిన యూనిట్లేవీ రాలేదు. ఇప్పుడా కొరత తీరుస్తూ టాటా అనుబంధ సంస్థ స్మార్ట్ ఫుడ్స్ లిమిటెడ్ తన అల్ట్రా మెగా ప్రాజెక్టును ఏర్పాటు చేయబోతోంది.