తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. మహాసంప్రోక్షణ క్రతువు ఉన్నందున 9 రోజుల పాటు శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 9వ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి ఆగస్టు 17 ఉదయం 6 గంటల వరకు వెంకన్న దర్శనానికి భక్తులను అనుమతించకూడదని ఈరోజు జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో 12ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహా సంప్రోక్షణపై చర్చించేందుకు టీటీడీ పాలకమండలి శనివారం భేటీ అయ్యింది.
మహాసంప్రోక్షణ జరపాలన్న ఆగమ పండితుల సలహాకు అనుగుణంగా ఆగస్టు 12 నుంచి 16 వరకు అష్టబంధన, బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలను తిరుమల కొండపై నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 11న మహాసంప్రోక్షణకు అంకురార్పణ జరుగనుంది. ఆయా రోజుల్లో వైదిక కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉండటం, భక్తులకు దర్శనం కల్పించేందుకు తక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 12 నుంచి వైదిక కార్యక్రమాలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇందుకు ముందుగానే భక్తులకు దర్శనం నిలిపివేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రోజూ తిరుమలకు వచ్చే వారి సంఖ్య లక్షకు పైగా చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చెబుతోంది.
ఒకవేళ పరిమితంగా అనుమతించినా రోజుకు 20వేల మందికి మాత్రమే దర్శనం అవకాశం కలుగుతుందని మిగిలిన వారు క్యూలైన్లలో వేచి ఉండాల్సి ఉంటుందని అంటోంది. 10, 11 తేదీల్లో భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తే రెండు రోజుల పాటు కొండపై రద్దీ ఉంటుందన్న ఉద్దేశంతో రెండు రోజుల ముందుగానే భక్తుల రాకను నిలిపివేస్తున్నట్లు వివరించింది. ఇంతకు ముందు 2006లో మహా సంప్రోక్షణ నిర్వహించారు. అప్పట్లో తిరుమలకు రోజూ 20 నుంచి 30 వేల మంది భక్తులు వచ్చేవారని, దీంతో పరిమితంగానైనా దర్శనానికి అనుమతిచ్చేవారమని తెలిపారు. ప్రస్తుతం రోజూ తిరుమలకు వచ్చే వారి సంఖ్య లక్షకు పైగా చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.