Sidebar

13
Tue, May

భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఎత్తుకు పై ఎత్తు వేస్తోంది. రాజ్యసభలో తమ సంఖ్యా బలాన్ని పెంచుకోవటంతో పాటు ఇంత వరకు తమకు దూరంగా ఉన్న పార్టీల మద్దతు కూడగట్టుకునేందుకు తెర వెనక చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ సంఖ్యా బలం 69. అయితే ఈ సంఖ్యను పెంచుకొనేందుకు బీజేపీ అధినాయకత్వం ప్రస్తుతం ఖాళీగా ఉన్న నాలుగు నామినేటెడ్ సీట్లను భర్తీ చేసేందుకు యుద్ధ ప్రాతిపదిక పై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. రాజ్యసభకు నలుగురిని నామినేట్ చేయటం ద్వారా తమ సంఖ్యా బలాన్ని 69 నుండి 73 పెంచుకునేందుకు బీజేపీ అధినాయకత్వం శరవేగంగా పావులు కదుపుతున్నట్లు తెలిసింది. నాలుగు నామినేటెడ్ సీట్లకోసం బీజేపీ అధినాయకత్వం పన్నెండు పేర్లను పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

amitshah 30062018 2

ఈ పన్నెండు మందిలో నలుగురిని ఎంపిక చేసి వీరి పేర్లను రాష్ట్రపతి రామ్నాథ్ కోవిందకు పంపిస్తారని అంటున్నారు. ఆ నలుగురిలో బాలీవుడ్ మాజీ సూపర్ స్టార్ మాధురీ దీక్షిత్, హర్యానాకు చెందిన మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్, శివాజీ జీవితం ఆధారంగా 'జనతా రాజ్' అనే పుస్తకం రాసిన బాబాసాహెబ్ పురందరేతో పాటు పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడిని రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ కూటమికి ప్రస్తుతం 106 మంది సభ్యుల మద్దతు ఉన్నది. నలుగురు నామీనేటెడ్ సభ్యులను కలుపుకుంటే ఈ సంఖ్య 110కు చేరుకుంటుంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు బీజేపీ కూటమికి మరో ఇరవై మూడు మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే ఆరుగురు రాజ్యసభ సభ్యులున్న టీఆర్ఎస్ అధినాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరాపుతో ఈ విషయం గురించి ప్రస్తావించి ఉంటారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.

amitshah 30062018 3

ముగ్గురు సభ్యులున్న వైఎస్ఆర్ సీపీ కూడా బీజేపీకి మద్దతు ఇస్తుందనే మాట వినిపిస్తోంది. తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు ఉన్న బీజేడీని ఒప్పించేందుకు బీజేపీ అధినాయకత్వం తెర వెనక ప్రయత్నాలు ప్రారంభించింది. బీజేడీ మద్దతు ఇచ్చేందుకు అంగీకరిస్తే బీజేపీకి మరో ఐదుగురు సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. ఆ ఐదుగురి మద్దతు సంపాదించటం పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు పెద్ద పని కాదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. లోక్ సభ ఎన్నికల కోసం శివసేనతో రాజీపడేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్ధం కావటం తెలిసిందే. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి ఇవ్వటం ద్వారా శివ సేనను మంచి చేసుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఇంతవరకూ సత్పలితాలను ఇవ్వలేదు. ఇదిలా ఉండగా ప్రాంతీయ పార్టీల కూటమి ప్రతిపాదించే అభ్యర్థికి బీజేడీ మద్దతు సంపాదించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read