ఆంధ్రప్రదేశ్లోని ఒకటైన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు చెప్పుకుంటున్న కృష్ణా జిల్లా, నాగాయలంక తీర ప్రాంతంలో నిర్మించతలపెట్టిన క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గుల్లల మోద ప్రాంతంలో 154 హెక్టార్లలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రెండు దశ ల్లో రూ.1600 కోట్లు ఖర్చు చేసేందుకు రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది. తొలి దశ లో రూ. 600 కోట్లతో, రెండో దశలో వెయ్యి కోట్ల రూపాయలతో క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు న్యాయ శాఖ అనుమతి తెలిపింది. భూసేకరణకు రూ. 35 కోట్లు, అటవీ శాఖకు రూ. 85 కోట్లు చెల్లించినట్లు డీఆర్డీవో ( రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ ) వివరణ ఇచ్చింది.
ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు పర్యావరణ శాఖ ప్రకటించింది. ఒడిశాలోని బాలాసోర్ క్షిపణి పరీక్షా కేంద్రం తర్వాత కేంద్రం ఏపీలో ఏర్పాటు చేయబోయే రెండో రక్షణ శాఖ ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. బాలాసోర్ కంటే మెరుగైన సదుపాయాలతో మరో చోట క్షిపణి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని 2011లో కేంద్ర ప్రభుత్వం నిర్ణ యించింది. తూర్పు తీర ప్రాంతంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించిన మీదట కృష్ణా డెల్టా ప్రాంతంలోని గుల్లలమోద ప్రాంతం అనువైనదిగా గుర్తించారు. ఈ ప్రాంతం బంగాళాఖాతంలోకి చొచ్చుకెళ్లినట్టు ఉండడం ఈ ప్రాజెక్టుకు కలిసి వచ్చే అంశం.
ఈ కేంద్రం చుట్టుపక్కల 8 కిలో మీటర్ల పరిధిలో ఎక్కడా జనావాసాలు లేవు. పరిసర ప్రాంతాల్లో దట్టమైన మడ అడవులు ఉన్నాయి. ఈ క్షిపణి కేంద్రం ఏర్పాటు వల్ల తీర ప్రాంతం అంతా కూడా సురక్షితంగా ఉండబోతోంది. పరిసర ప్రాంతాలకు మౌలిక వసతులూ సమకూరనున్నాయి. దాదాపు 6 వందల మంది స్థానికులకు పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. సుమారు 3 వందల మంది శాస్త్రవేత్తలు, సిబ్బంది ఈ ప్రాంతంలో నివసించబోతున్నారు. ఆ ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగ పడబోతోంది.