గన్నవరం ఎయిర్‌పోర్టు రన్‌వే విస్తరణ పనులు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటి వరకు 60 శాతం మేర రన్‌వే పనులు పూర్తయ్యాయి. నూతన రన్‌వే అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని అతిపెద్ద రన్ వే కలిగిన ఎయిర్‌పోర్టుగా గుర్తింపు వస్తుంది. విశాఖపట్నం, రాజమండ్రి, చిత్తూరు ఎయిర్‌పోర్టులు కూడా విజయవాడ తర్వాత స్థానంలోనే ఉంటాయి. ప్రస్తుతం రాజమండ్రి ఎయిర్‌పోర్టు రన్‌వే విస్తరణ పనులు ప్రారంభించటం వల్ల విజయవాడ ప్రస్తుత రన్‌వేతో సమానంగా ఉంది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు 10 వేల అడుగుల విస్తీర్ణంలో ఉంది. విస్తరిస్తున్న రాజమండ్రి ఎయిర్‌పోర్టు విస్తీర్ణం 9 వేల అడుగుల విస్తీర్ణంలో ఉంది. విజయవాడ ఎయిర్‌పోర్టు రన్‌వే పొడవు ప్రస్తుతం 7500 అడుగులు (2286 మీటర్లు). దీనిని మరో 3500 అడుగులు (1704 మీటర్ల) మేర ప్రస్తుతం పొడిగిస్తున్నారు. ఈ ఎయిర్‌పోర్టుకు అదనపు రన్‌వే అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో అత్యంత పొడవైన రన్‌వేగా రికార్డుకెక్కుతుంది.
ఆరు నెలల కాలంగా రన్‌వే విస్తరణ పనులు ఎంతో పురోగతిలో ఉన్నాయి. లోతట్టు వ్యవసాయ భూములలో రన్‌వే అనుసంధానానికి, ఐసోలేషన్ బే, ప్రహరీ గోడల నిర్మాణానికి మార్కింగ్ పనులు చకచకా ప్రారంభించారు. రన్‌వేను విస్తరించటానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. లోతట్టు పంట భూములను మెరక చేయటానికి బ్రహ్యయ్యలింగం చెరువు నుంచి రోజూ వందల సంఖ్యలో పెద్ద టిప్పర్లతో మట్టిని ఇక్కడ డంప్ చేస్తే కానీ ఇప్పుడు చూస్తున్న స్వరూపం రాలేదు. మరో రెండు నెలలు మట్టి డంప్ చేస్తే ఎర్త్ పిల్లింగ్ పూర్తవుతుంది. ఎర్త్ ఫిల్లింగ్‌కు సంబంధించి 80 శాతం మేర పనులు పూర్తయ్యాయి. ఎర్త్ ఫిల్లింగ్ మీద ఐదు రకాల ధృడమైన లేయర్లను వేశారు. డబ్ల్యూబీఎం, వెట్‌మిక్స్, హాట్‌మిక్స్ వంటి ఐదు రకాల లేయర్లతో నేలను దృఢంగా తయారు చేస్తారు. దీనిపై రెండు లేయర్ల బీటీ వేశారు. నూతన రన్‌వే పనులు దాదాపుగా పూర్తయ్యాయి.
ప్రస్తుత రన్‌వే దగ్గర అనుసంధానించాల్సిన ప్రాంతంలో మాత్రమే రోడ్డు ఉండటం వల్ల కొంత బిట్ మిగిలి ఉంది. ఇది కూడా పూర్తి చేసిన తర్వాత మాత్రమే మూడవ లేయర్‌ను వేస్తారు. మూడవ లేయర్ ఏర్పాటుతో నూతన్ రన్‌వే విస్తరణ పూర్తవుతుంది. ఇకపోతే ప్రధానంగా స్వాధీనం చేసుకున్న 700 ఎకరాల విస్తీర్ణం వెంబడి ప్రహరీ గోడ నిర్మాణ పనలు చేపట్టారు. ప్రహరీ పనులు కూడా 90 శాతం మేర పూర్తయ్యాయి. విమానాశ్రయ రన్‌వే విస్తరణ ప్రధాన పనులు జరగాల్సిన చోట ఉన్న బుధవారం రోడ్డును మూసివేయాల్సి ఉంది. ప్రత్యామ్నాయ రోడ్డు విషయంలో ఇంకా అడుగులు పడకపోవటంతో ప్రస్తుత రోడ్డును కొనసాగించాల్సి వస్తోంది. దీంతో నూతన రన్‌వేను, ప్రస్తుత రన్‌వేకు అనుసంధానం చేయలేని పరిస్తితి ఏర్పడుతోంది. ఈ సమస్యను ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత త్వరగా రన్‌వే పూర్తి చేసే అవకాశం ఉంది.