కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చి సమీక్ష చేసారు. నితిన్ గడ్కరీతో పాటు, సీఎం చంద్రబాబు కూడా పోలవరంలో పర్యటించారు. పోలవరం స్పిల్ వే పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి పై గడ్కరీకి చంద్రబాబు వివరించారు. తరువాత, ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. అయితే ఈ సందర్భంలో, నితిన్ గడ్కరీ మాట్లాడిన మాటలతో, రాష్ట్ర బీజేపీ నేతలు ఫీజులు ఎగిరిపోయాయి. ప్రతి రోజు, పోలవరం పై రాష్ట్ర బీజేపీ నేతలు విషం చిమ్ముతున్నారు. చంద్రబాబు అవినీతి చేస్తున్నారని, అసలు పోలవరంలో ఏమి పనులు జరగటం లేదని, ఇంకో రోజు పోలవరం మోడీ వేసిన భిక్ష అని, ఇలా నోటికి ఏది వస్తే అది మాట్లడటం చూస్తున్నాం. అయితే, వారికి సామాధనంగా, వారి సొంత పార్టీ మంత్రే, ఈ రోజు చంద్రబాబు పై ప్రశంసల వర్షం కురిపించారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అద్భుతమైన పురోగతి సాధించారని, నేను పోయిన సారి వచ్చినప్పటికీ, ఇప్పటికీ చాలా తేడా ఉందని, రిమార్కబుల్ అంటూ చంద్రబాబు పై ప్రశంసలు కురిపించారు. పోలవరం పూర్తి చేయాలని చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారని, చంద్రబాబు సంకల్పం తనను ఆశ్చర్యపరుస్తోందని గడ్కరీ పొగడ్తలు గుప్పించారు. ఎంత పెద్ద మిషనరీ ఉన్నా, వనరులు ఉన్నా, చంద్రబాబు లాంటి పట్టుదల ఉన్న వారు ఉంటేనే, ఇలాంటి ప్రాజెక్ట్ లు పూర్తవుతాయి అన్నారు. ఇంతకు ముందే పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించాల్సి ఉంది, నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, అవేంటో మీకు తెలుసు అంటూ గడ్కరీ చమత్కరించారు.
నీటి సదుపాయం ఉంటే ఎంత మేలు జరుగుతుందో రైతుగా తనకు తెలుసునని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఏప్రిల్ నాటికి సివిల్స్ వర్క్స్ పూర్తిచేస్తామని అధికారులు అన్నారని, ఫిబ్రవరి నాటికి పూర్తిచేయాలని సూచించానన్నారు. పోలవరానికి నిధుల సమస్య లేదన్నారు. ముందస్తుగా నిధులు ఇవ్వాలని సీఎం అడిగారని, ఆర్థికశాఖతో చర్చిస్తాననని వెల్లడించారు. సహాయ, పునరావాసంలో గిరిజన ప్రాంతాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అభివృద్ధి పనుల విషయంలో తాము రాజకీయం చేయబోమని, పోలవరాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని అన్నారు. సవరించిన అంచనాలపై ఆర్థిక శాఖ నుంచి ఆమోదం తీసుకోవాల్సి ఉందన్నారు.