జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. ప్రశ్నించేందుకే జనసేన అన్న పవన్.. రాష్ట్రానికి నష్టకరంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్ గురించి ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి కళా వెంకట్రావు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందించకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం పవన్‌కల్యాణ్ చౌకబారు విమర్శలు చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఒక వైపు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో అలుపెరగని పోరాటం చేస్తుంటే మరో వైపు వైకాపా, జనసేన పార్టీలు కేంద్రంలోని భాజపాతో కలిసి లాలూచీ రాజకీయలు చేస్తున్నాయని ఆరోపించారు.
ఈసందర్భంగా పవన్‌కు కొన్ని ప్రశ్నలు మంత్రి సంధించారు. ఇచ్చిన హామీ మేరకు కాపులకు రిజర్వేషన్‌ను కల్పించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుందని.. ఆ బిల్లును కేంద్రం ఆమోదించకుండా నానబెడుతుంటే మోదీని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. విభజన హామీలను మొత్తం చేసేశామని సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేస్తే పవన్ ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదన్నారు. ఉత్తరాంధ్రకు ఇచ్చిన రూ.150 కోట్లు ప్రధాని వెనక్కి లాగేసుకున్నా.. విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్ కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు నాలుగేళ్లు అయినా ఇవ్వకపోయినా.. పవన్ ఎందుకు మోదీని విమర్శించరని ప్రశ్నించారు.
విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు తగు సాయం ఇవ్వన్ని కేంద్రాన్ని పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటుపై పవన్ తన వైఖరిని ఎందుకు ఇంత వరకు తెలియజేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రైల్వేజోన్ కోసం తెదేపా ఎంపీలు దీక్ష చేపడితే కనీసం సంఘీభావం తెలపకుండా విమర్శలకు దిగటం వెనక ఉన్న ఆంతర్యం ఏంటంటూ పలు ప్రశ్నలు సందించారు. పవన్, జగన్, మోదీతో కుమ్మక్కులో భాగమే రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు.