రాష్ట్రం పై కేంద్రం డేగ కన్ను వేసిందని, మనం ఎక్కడ దొరుకుతామా అని చూస్తున్నారని, అందుకే ప్రతి పనిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఎక్కడా చిన్న తప్పు కూడా జరగకూడదని, కేంద్రం మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. రాబోయే మూడు నెలలు వ్యవసాయానికి కీలకమైనందున రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసం నుంచి జిల్లా కలెక్టర్లు, పలు శాఖల ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నకిలీ విత్తనాలు, పంటలకు తెగుళ్ల బెడద, ఎరువుల కొరత, విద్యుత్ కోతలు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఖర్చులు తగ్గిస్తూ, దిగుబడులను పెంచేందుకు చర్యలు చేపట్టామని, మార్కెటింగ్ సమస్యలు కూడా లేకుండా చూస్తున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది బిందు, తుంపర సేద్యాన్ని మరింత ప్రోత్సాహించాలని తెలిపారు. విత్తులు, నాట్లకు అనుకూలత పై ప్రచారం చేయాలన్నారు. చెరువుల్లోకి నీరు చేరిందని, రైతులు డిజిటల్ మహిళా అసిస్టెంట్ల సేవలను వినియోగించుకోవాలని కోరారు. వాతావరణ మార్పులపై ఎప్పటికపుడు రైతులకు సమాచారం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. వ్యవసాయానికి సాంకేతికను అనుసంధానం చేయటం వల్ల మరింత ప్రయోజనం ఉంటుందని, పంటల సాగు నమోదుకు ఈ - పంట యాప్ ను వినియోగించాలని చెప్పారు. మూడు నెలలో రూ.2,500 కోట్ల ఉపాధి నిధులను ఖర్చు చేశామని, మరో రూ.1,600 కోట్లను సద్వినియోగం చేసుకోవాల్సి ఉందన్నారు. ఐదు వేల కిలో మీటర్ల సిమెంట్ రోడ్లు, మూడు వేల కిలో మీటర్ల అప్రోచ్ రోడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు.
ఘన, ద్రవవ్యర్థాల నియంత్రణ వ్యవస్థ పై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. గ్రామీణాభివృద్ధిశాఖకు 11 అవార్డులు లభించినందుకు ఆ శాఖ అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు. మూడు నెలలో 1.05 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశామన్నారు. ఇదిలావుండగా, గృహ ప్రవేశాలను గిన్నిస్ బుక్ లో నమోదు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. టెలికాన్ఫరెన్స్లో మంత్రి కాల్వ శ్రీనివాసులు, జల వనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణకుమార్, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీ రాజశేఖర్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి, డైరెక్టర్ రంజిత్ భాషా, ఆర్డబ్ల్యుఎస్ ముఖ్య కార్యదర్శి రామాంజనేయులు, గృహనిర్మాణశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే తదితరులు పాల్గొన్నారు.