ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 8 నుంచి 10 వరకు సింగపూర్‌లో పర్యటించనున్నారు. అక్కడ ప్రతి రెండేళ్లకు జరిగే ప్రపంచ నగరాల సదస్సులో ఈ సారి శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘేతో పాటు చంద్రబాబు ప్రత్యేక అతిథిగా పాల్గొంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ నగరాలకు చెందిన 120 మంది మేయర్లు ఈ సదస్సులో పాల్గొంటారు. ప్రపంచ నగరాల సదస్సులో భాగంగా 8న మేయర్ల ఫోరంలో ‘నివాసయోగ్య, సుస్థిర నగరాలు-సాంకేతికతతో సమ్మిళత వృద్ధి, రాష్ట్ర, నగరస్థాయి సమన్వయం’ అన్న అంశంపై సీఎం ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం వివిధ దేశాల మేయర్లు, ప్రతినిధులతో జరిగే విందులో పాల్గొంటారు. 9న జరిగే ప్లీనరీలో రణిల్ విక్రమసింఘేతో కలసి చంద్రబాబు పాల్గొంటారు.
సింగపూర్ పెవిలియన్‌లో ‘నగరీకరణ- జలవనరులు, పర్యావరణం, రవాణా నిర్వహణ’ అన్న అంశంపై ప్రపంచబ్యాంకు సీఈఓ క్రిస్టాలినా జార్జివా, యూఏఈ పర్యావరణ మంత్రి థాని అల్ జియోది, జాకోబ్స్ ఛైర్మన్ స్టీవెన్ డెమెట్రూ, దసాల్ట్స్ సిస్టమ్స్ వైస్ ఛైర్మన్ బెర్నార్డ్ చార్లెస్‌లతో కలసి చర్చలో పాల్గొంటారు. సింగపూర్ మంత్రులు హెంగ్ స్వీ కెయెట్, లారెన్స్ వోంగ్, ఈశ్వరన్, డెస్మాండ్ లీ టీసెంగ్‌లతో చంద్రబాబు సమావేశమవుతారు. ప్రఖ్యాత లీ క్వాన్ యూ ఇనిస్టిట్యూట్‌లో జరిగే ‘లీ క్వాన్ యూ’ అవార్డు ప్రదానోత్సవంలో, సింగపూర్ అధ్యక్షురాలు హలీమా యాకోబ్‌తో కలసి పాల్గొంటారు. మేయర్స్ ఫోరంకి చెందిన ముఖ్యడు గ్రెగ్ క్లార్క్, ఏఐఐబీ డైరెక్టర్ జనరల్ పాంగ్ ఈ యాన్, ఫోర్టెస్ క్యూ మెటల్స్ గ్రూపునకు చెందిన గౌతమ్ వర్మ, రాయల్ హోల్డింగ్స్ ప్రతినిధి రాజ్‌కుమార్ హీరా నందాని, ఎలీ హజాజ్ ఎండీ సతీష్, మలేసియన్ రైలు కంపెనీ ప్రతినిధులు తదితరులతో సమావేశమై, ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారానుకూలతల గురించి వివరిస్తారు.
రాష్ట్రంలో వ్యవసాయరంగ అభివృద్ధిపై జర్మన్ అగ్రి బిజినెస్ ప్రతినిధులతో చర్చిస్తారు. ప్రపంచ నగరాల సదస్సులో రాజధాని అమరావతిపై సీఆర్డీఏ ప్రత్యేక పెవిలియన్‌ను ఏర్పాటు చేస్తోంది. నిర్మాణరంగ ప్రముఖులతో కూడిన ప్రత్యేక బృందం సొంత ఖర్చులతో ముఖ్యమంత్రి వెంట సింగపూర్ వెళుతోంది. మేయర్ల సదస్సులో వారిని ముఖ్యమంత్రి పరిచయం చేస్తారు. రాజధానిలోను, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోను పెద్ద ఎత్తున జరుగుతున్న నిర్మాణరంగ ప్రాజెక్టుల్లో స్థానిక బిల్డర్లకు, అనుబంధ రంగాలకు చెందినవారికి అవకాశాలు కల్పించడం, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాలు, పద్ధతులపై అవగాహన కల్పించడం లక్ష్యంగా వారిని సింగపూర్ పర్యటనకు తీసుకు వెళుతున్నారు. సింగపూర్ భాగస్వామ్యంతో దొనకొండలో తలపెట్టిన నిర్మాణ నగరంపైనా కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. 9, 10 తేదీల్లో సీఎం నిర్మాణ రంగానికి చెందిన ప్రతినిధులతో కలసి సింగపూర్‌లో క్షేత్ర పర్యటనలు నిర్వహిస్తారు. తక్కువ వ్యయంతో నిర్మించిన గృహ సముదాయాలను పరిశీలిస్తారు. సింగపూర్, ఏపీకి చెందిన నిర్మాణరంగ ప్రముఖులతో జరిగే రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొంటారు.