ఏపీకి అన్ని ఇచ్చేశామని సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం తాజాగా ప్రాజెక్టుల విషయంలో దాటవేత దోరణి అవలంభించింది. సుప్రీం కోర్టుకు కేంద్ర ఆర్థిక శాఖ జలవనరుల శాఖ అందించిన అఫిడవిట్లో ఎక్కడ ప్రాజెక్టులపై స్పష్టమైన సమాచారాన్ని పొందుపరచలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి పిటిషన్‌పై కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన కేంద్రజలవనరుల శాఖ 47 పేజీల అఫిడవిట్లో వివరాలు పూర్తిగా దాచిపెట్టి.. కొన్ని విషయాలను మాత్రమే పొందిపరిచింది. పోలవరంపై పూర్తిగా స్పష్టత లోపించింది. నీటిపారుదల విభాగం వరకే నిధులు ఇస్తామని కేంద్రం తెలిపింది. కృష్ణా, గోదావరి బోర్డుల విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరి చెప్పలేదు. నీటి కేటాయింపులు, జలవివాదాల పరిష్కారంపై స్పందించలేదు.
విభజన చట్టంలో ప్రధాన అంశాలపై కేంద్రం దాటవేత ధోరణి ప్రదర్శించింది. పోలవరం భూసేకరణ, పునరావాసం అంశాలను పట్టించుకోలేదు. జలవనరుల శాఖ ఎస్టీ కమిషన్ సిఫారసుల ప్రస్తావనే చేయలేదు. పోలవరం, నీటి పంపకాలు, జల వివాదాలపై అరకొర సమాచారంతో సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది. మరో పక్క, ఈ విషయం పై యనమల స్పందించారు. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించేదిగా ఉందని ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఉద్దేశ పూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. తొలి ఏడాది ఆర్ధికలోటుపై అరుణ్ జైట్లీ చెప్పిన ఫార్ములా గురించి అఫిడవిట్లో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో ఆర్ అండ్ ఆర్ గురించి స్పష్టత ఇవ్వలేదన్నారు. పునరావాస ప్యాకేజీ నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు.
14వ ఆర్ధిక సంఘం 42% వాటా ఇచ్చింది కాబట్టి ఏమీ ఇవ్వాల్సిన పనిలేదు అన్నట్లుగా వ్యవహరిస్తోందన్నారు. పునర్విభజన చట్టంలో ఏపీకి ఇస్తామని చెప్పింది ఏమిటి..? అఫిడవిట్ కేంద్రం పేర్కొన్నదేమిటని దుయ్యబట్టారు. చట్టంలో చెప్పిన దానికి, అఫిడవిట్లో పెట్టినదానికి ఏమీ పొంతన లేదన్నారు. ఏపీకి ఇంకా రావాల్సింది ఏమిటని అని తెదేపా డిమాండ్ చేస్తోందో, అవన్నీ ఇచ్చేశామని కేంద్రం అఫిడవిట్ లో పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది ప్రజలనే కాదు న్యాయస్థానాలను కూడా పక్కదారి పట్టించడమేనని యనమల అన్నారు. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌కు వ్యతిరేకంగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తామని యనమల స్పష్టం చేశారు.