వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించేందుకు వైసీపీ-జనసేన పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని మాజీ ఎంపీ సబ్బం హరి అభిప్రాయపడ్డారు. ‘ఏబీఎన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ రెండు పార్టీలను వెనుకుండి బీజేపీ నడిపిస్తోందని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి రాజకీయాలు నడిపిందో, ఈరోజున ఏపీలో బీజేపీ అలాంటి రాజకీయ క్రీడ నడపబోతోందనే విషయం రాజకీయ అనుభవం ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. ఏపీలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ కలిసి పనిచేస్తున్నారనే విషయం అందరికీ తెలుసని, రాబోయే రోజుల్లో ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు.
ఏపీలో బీజేపీని బతికించడం కోసమే వైసీపీ, జనసేన పార్టీలు కలుస్తాయని సబ్బం హరి అభిప్రాయపడ్డారు. ఆయన మాట్లాడుతూ, ‘ఈ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. బీజేపీ చెప్పినట్టు ఈ రెండు పార్టీలు చేస్తాయనడానికి గత నెలరోజులుగా ఈ పార్టీల నేతలు చేస్తున్న ప్రసంగాలే నిదర్శనం. టీడీపీ, చంద్రబాబు నాయుడిని టార్గెట్ గా చేసుకుని ప్రసంగాలు చేస్తున్నారు. ‘పవన్ కల్యాణ్ గారు మా పార్టీకి మద్దతిస్తానని నాకే చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ తో కలిసి పవన్ కలిసి పనిచేస్తారు’ అని తిరుపతి వైసీపీ ఎంపీ వరప్రసాద్ గారు ఈ మధ్య ఓ ప్రకటన చేశారు కదా!’ అని చెప్పుకొచ్చారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిన కారణంగా ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకొచ్చిన తర్వాత ఏపీలో బీజేపీకి చాలా వ్యతిరేకత వచ్చిందని, చంద్రబాబు వాదనను ప్రజలందరూ అంగీకరించారని చెప్పారు. అదే సమయంలో, బీజేపీని, మోదీని వైసీపీ, జనసేన పార్టీలు వ్యతిరేకించకపోవడాన్ని ప్రజలు స్పష్టంగా గమనించారని అన్నారు.
వివాదాలు సృష్టించడానికే పవన్ మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ సబ్బంహరి అన్నారు. వైఎస్ హయాంలో పనిచేసిన ఈవోలు, అప్పట్లో చంద్రబాబుతో పనిచేసిన ఈవోలంతా తిరుమలలో పింక్ డైమండ్ లేదని చెప్పారని అయన గుర్తు చేశారు. పవన్ పదేపదే అదే విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాను గెలిపించడం వల్లే అశోక్‌గజపతి గెలిచారని పవన్ అన్నారని, వాళ్లు అనుభవిస్తున్నవన్నీ తన దయే అన్నట్టు పవన్ మాట్లాడారని సబ్బంహరి గుర్తుచేశారు. అలా మాట్లాడినందుకే పవన్‌పై ఉత్తరాంధ్రలో తీవ్రవ్యతిరేకత వస్తుందని చెప్పారు. 1983 నుంచి 2014 వరకు అశోక్‌గజపతిరాజు గెలుస్తూ వస్తూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. అప్పుడు కూడా అశోక్‌గజపతిరాజును పవనే గెలిపించారా? అని ప్రశ్నించారు. టీడీపీలో క్రమశిక్షణ గల సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు అని సబ్బంహరి స్పష్టం చేశారు.