బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో సీఆర్డీఏ 17 వ అథారిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రాజధాని అభివృద్ధి పనులను సమీక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అమరావతి పరిధిలో గల కృష్ణానది తీరంలో శ్రీ వేంకటేశ్వరుని ఆలయ నిర్మాణం చేపట్టాలన్న ప్రతిపాదనపై సమావేశంలో చర్చించారు. పవిత్ర సంగమ ప్రాంతంలో ఇప్పటికే దీనికి అనుకూలంగా ఉండే స్థలాన్ని గుర్తించారు. టీటీడీ ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టనుంది. రాజధానిలో సొంత ఇళ్లను కొనుగోలు చేయాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ కాంట్రాక్టు ఉద్యోగులు, హైకోర్టు న్యాయవాదులు, ఇతర వర్గాల నుంచి వస్తున్న డిమాండును దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి వెయ్యి గృహాలను వాణిజ్యపరంగా నిర్మించడం కోసం రూపొందించిన ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. 1285, 1580, 1880, 2150 చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నిర్మిస్తారు. చదరపు అడుగుకు రూ.3 వేల ధరను ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.500 కోట్ల వ్యయం కాగలదని అంచనా వేశారు.
రాజధానిలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నామని, ఇటువంటి వ్యవస్థ దేశంలో ఇదే ప్రథమమని సీఆర్డీఏ కమిషనర్ చెప్పారు. అమరావతిలో విద్యాలయాలను నెలకొల్పడానికి 8 ప్రఖ్యాత సంస్థలు ముందుకొచ్చాయని, నిర్మాణాలను చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయని చెప్పారు. ఇవిగాక సెయింట్ గేబ్రియల్, ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ సొసైటీ, పీహెచ్ఆర్ ఇన్వెంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ, జూబిలీహిల్స్ ఎడ్యుకేషనల్, సొసైటీ ఆఫ్ సెయింట్ మేరీ, ఎన్ఎస్ఎం కూడా దరఖాస్తు చేశాయని తెలిపారు.
కొన్ని స్టార్ హోటళ్లు ముందుకొస్తున్నాయని పైవ్ స్టార్ హోటళ్లు 4, ఫోర్ స్టార్ హోటళ్లు 4, త్రి స్టార్ హోటల్ ఒకటి రాజధానిలో త్వరలో నిర్మాణాలను చేపట్టనున్నాయని చెప్పారు. ప్రస్తుతం విజయవాడలో 1700 హోటల్ గదులు అందుబాటులో వున్నాయని, అమరావతి నగరంలో మొత్తం 10 వేల గదులు అందుబాటులోకి తీసుకురావాలన్నదే లక్ష్యమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. శాఖమూరులో 7.5 ఎకరాల విస్తీర్ణంలో శిల్పారామం తరహాలో ఏర్పాటు చేయనున్న ఎత్నిక్ విలేజ్లో ఎకరం స్థలంలో క్రాఫ్ట్ బజారును ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ క్రాఫ్ట్ కౌన్సిల్ ముందుకొచ్చింది.