విశాఖకు మరో మణిహారం రానుంది. గేమింగ్ ప్రపంచాన్ని శాసించేలా ‘డిజైన్ యూనివర్సిటీ’ నెలకొల్పేందుకు యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) ముందుకొచ్చింది. ‘గేమింగ్-డిజిటల్ లెర్నింగ్ హబ్’ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఆర్ధికాభివృద్ధి బోర్డు(ఏపీఈడీబీ)తో ఒప్పందం కుదుర్చుకున్న యునెస్కో ప్రతినిధి బృందం బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. విశాఖను ఇంటర్నేషనల్ గేమింగ్, డిజిటల్ లెర్నింగ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సిద్ధంగా వున్నామని, ఇందుకోసం వంద ఎకరాల భూమిని కేటాయించాలని యునెస్కో బృందం ముఖ్యమంత్రిని కోరింది.

visakha 05072018 2

భవిష్యత్‌లో గేమింగ్ టెక్నాలజీ ఉత్తమ ఆదాయ వనరుగా వుంటుందని, యుబీ సాఫ్ట్, శాంసంగ్, మైక్రోసాఫ్ట్ వంటి అత్యుత్తమ సంస్థలు సైతం తమ సెంటర్లు ఇక్కడ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా వున్నాయని యునెస్కో ప్రతినిధులు తెలిపారు. 10 ఏళ్లలో 50 వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఎడ్యుటెక్ గేమింగ్‌ను అభివృద్ధి చేస్తామని, మొత్తం భారతదేశంలోని గేమింగ్ మార్కెట్‌లో 25 శాతం ఏపీ నుంచే వుంటుందని ముఖ్యమంత్రికి యునెస్కో ప్రతినిధులు వివరించారు. లెర్నింగ్ డిజబిలిటీతో బాధపడే చిన్నారులకు ప్రత్యేక విద్యా బోధన, స్టార్టప్‌లకు వెంచర్ ఫండ్ అందివ్వడం, ఇంక్యుబేషన్ సెంటర్లు, గ్లోబల్ రీసెర్చ్ సెంటర్, డిజిటల్ ఎడ్యుకేషన్‌లో గ్లోబల్ సర్టిఫికేషన్ బ్యూరో, గేమింగ్-డిజిటల్ టీచర్ ట్రైనింగ్ అకాడమీ, గేమింగ్-డిజిటల్ స్కిల్ డెవలప్‌మెంట్ అకాడమీ ఈ హబ్‌లో భాగంగా వుంటాయని వెల్లడించారు.

visakha 05072018 3

ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ ఎకానమీ-ఇన్నోవేషన్ వ్యాలీగా అభివృద్ధి చేయాలని, గేమింగ్ టెక్నాలజీని అన్ని రంగాల్లోనూ వినియోగించేలా విస్తృత పరచాలని యునెస్కో బృందానికి ముఖ్యమంత్రి సూచించారు. గేమింగ్ టెక్నాలజీ ద్వారా నైపుణ్యాభివృద్ధిని పెంపొందించే ప్రయత్నం జరగాలని చెప్పారు. విద్యాప్రమాణాలు రూపొందించి ‘వైజాగ్ డిక్లరేషన్’గా ప్రాచుర్యం కల్పించాలన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, ఏపీఈడీబీ సీఈవో జాస్తి కృష్ణ కిషోర్, యునెస్కో ఎంజీఐఈపీ ప్రతినిధులు అనంత దొరైయప్ప, నందిని చటర్జీ, అర్చనా చౌదరి, నాట్ మలుపిళ్లై, డాక్టర్ మనోజ్ సింగ్ పాల్గొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read