సమీకృత ఇంధన అభివృద్ధి పథకం(ఐపీడీఎస్), దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన(డీడీయూజీజేవై) పథకాల పనితీరులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు తమను కేంద్ర ప్రభుత్వం అభినందించిందని ఏపీ ఇంధన శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సిమ్లాలో మంగళవారం జరిగిన ఇంధనశాఖా మంత్రుల సదస్సులో కేంద్ర ఇంధనశాఖ మంత్రి ఆర్‌కే సింగ్ ఈ మేరకు అభినందించారని పేర్కొంది. గృహాల విద్యుదీకరణ, సాంకేతిక, వాణిజ్య నష్టాలు తగ్గించుకోవడం, బొగ్గు వినియోగంలో సౌలభ్యత, 24 గంటల విద్యుత్తు సరఫరా తదితర అంశాల్లో ఏపీ పనితీరును వారు ప్రశంసించారని వివరించారు. ఏపీ ఇంధనశాఖా మంత్రి కళా వెంకటరావు తరఫున ఈసదస్సుకు ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ హాజరయ్యారు. అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నందున తమకు కేంద్రం అన్ని విధాల సహకరించాలని చంద్రబాబు కోరినట్లు ఆయన సమావేశంలో వివరించారు.
ఏపీ విద్యుత్ రంగం ఎనర్జీ సామర్థ్యం, బొగ్గు కొరతల నివారణ, రెన్యువబుల్ ఎనర్జీ తదితర అంశాలపై తీసుకుంటున్న చర్యలను వివరించారు. విద్యుత్ వినియోగం పెద్దగాలేని సమయాల్లో రోజుకు 500 మెగావాట్ల విద్యుత్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదా చేస్తున్నట్లు తెలిపారు. 2014లో ఇంధన లోటు 8 శాతం కంటే ఎక్కువగా ఉండేదన్నారు. 2016 నాటికి నూరు శాతం గృహ విద్యుదీకరణను సాధించడంలో విజయం సాధించామన్నారు. ట్రాన్స్మషన్ పంపిణీ నషాల తగ్గింపు 12.06 శాతం నుండి 9.72 శాతానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏపీ తగ్గించగలిగిందన్నారు. ఇందులో కూడా ఏపీ ట్రాన్స్ కో 2.32 వాతం తక్కువ ట్రాన్స్మిషన్ నష్టాలను సాధించి రికార్డు సృష్టించిందన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రచార రథానికి ఇతర రాష్ట్రాల నుండి మంచి స్పందన లభించిదన్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీపై ఏపీ యొక్క ప్రోత్సాహకాలు వారిని ఎంతో ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ విధానంపై ప్రత్యేకంగా వివరించడం జరిగింది. ఈ విధానం ద్వారా విద్యుత్ వాహనాల అభివృద్ధి చేస్తున్న విధానాన్ని వారు ఇతర రాష్ట్రాలవారికి తెలియజేశారు. ఈ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపు, రోడ్డు పన్ను, విద్యుత్ వాహన తయారీ పార్కులు, అభివృద్ధి, ఛార్జింగ్ వనరులు వంటి అంశాలను వివరించారు. అంతేకాకుండా ఈ విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకుగానూ ఈ ఏడాది జూలై నాటికి 50 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఏర్పాటుచేసిన 250 గ్రిడ్ ఆధారిత సోలార్ పంప్సెట్ల విధానంపై వివరించారు. రాష్ట్రంలో అత్యంత విజయవంతమైన ప్రాజెక్టుగా ఆయన దీనిని అభివర్ణించారు. దీనితో పాటు ఏపీలో 11 లక్షల స్మార్టు మీటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సోలార్ పంపసెట్ల విధాన అమలుపై పలు రాష్ట్రాల ప్రతినిధులు ఏపీ పనితీరును ప్రశంసించారు.