కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తూ వాతావరణ ప్రతికూలత నేపథ్యంలో హిల్సా బేస్ క్యాంపు వద్ద చిక్కుకొని తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న తెలుగు యాత్రికుల యోగక్షేమాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఈ మేరకు అక్కడి పరిస్థితిపై ఏపీ భవన్ కమిషనర్ శ్రీకాంత్తో మాట్లాడగా.. హిల్సాలో పరిస్థితి గురించి ఆయన సీఎంకు వివరించారు. హిల్సా బేస్ క్యాంప్ వద్ద 100 మంది తెలుగు యాత్రికులు ఉన్నట్టు వారు తెలిపారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా యాత్రికుల గురించి సీఎం ఆరా తీశారు.
ఎయిర్లైన్స్ ప్రతినిధులతో మాట్లాడని సీఎం అధికారులను ఆదేశించారు. యాత్రికులను హెలికాప్టర్లో హిల్సా నుంచి సిమిల్కోట్కు.. అనంతరం సిమిల్కోట్ నుంచి ప్రత్యేక విమానంలో నేపాల్గంజ్కు తరలించాలని సూచించారు. అలాగే, నేపాల్లోని భారత రాయబార కార్యాలయ అధికారులను కూడా సంప్రదించాలన్నారు. యాత్రికులకు అవసరమైన రవాణా, వైద్య సదుపాయాలను సమకూర్చాలని ఆదేశించారు. తెలుగు యాత్రికులంతా క్షేమంగా స్వస్థలాలకు చేరేలా వారికి తోడ్పాటునందించాలన్నారు.
మరోవైపు నేపాల్ రాయబార కార్యాలయ అధికారులతో ఇప్పటికే ఏపీ భవన్ అధికారులు సంప్రదింపులు జరపగా.. వారు స్పందించారు. యాత్రికులతో తమ ప్రతినిధులు సంప్రదింపుల్లో ఉన్నారని వెల్లడించారు. వారికి అవసరమైన ఆహారం, తాగునీరు, ఇతర వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. సిమిల్కోట్లో తమ వైద్యసిబ్బందిని సిద్ధంగా ఉంచినట్టు చెప్పారు. యాత్రికులను సురక్షితంగా తీసుకొచ్చే మార్గాలను అన్వేషిస్తున్నామని అన్నారు. ప్రతికూల వాతావరణం వల్ల ఇబ్బందులు వున్నాయని తెలిపారు. వాతావరణం అనుకూలించగానే విమానాలు నడుపుతామని సంస్థలు చెప్పాయని తెలిపారు.