ప్రధాన మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న నీతి ఆయోగ్ కి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏంటో తెలియదు.. మన సచివాలయం ఎక్కడ ఉంటుందో తెలియదు. అన్ని రాష్ట్రాలని అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఆదేశించే నీతి ఆయోగ్ పరిస్థితి ఇది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నీతి ఆయోగ్ కి జ్ఞానోదయం చెయ్యల్సిన పరిస్థితి. అందుకే ,ఆంధ్రప్రదేశ్ సచివాలయం అడ్రస్ మారిందని తెలుపుతూ నీతి ఆయోగ్‌కు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. వెలగపూడి కేరాఫ్ ఏపీ క్యాపిటల్ హైదరాబాద్ అంటూ ఇటీవల నీతి ఆయోగ్ తప్పుడు చిరునామాతో ఒక లేఖ రాసింది. ఈ లేఖ చూసిన అధికారులు అవాక్కయ్యారు. నీతి ఆయోగ్, ఇలా రాయటం ఏంటి అని చర్చించుకుని, ముఖ్యమంత్రికి విషయం చెప్పారు. సియం, ఈ విషయం పై నీతి ఆయోగ్ లేఖ రాయమని అధికారులకు చెప్పారు.
ఆంధ్రప్రేష్ రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు దాటింది. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని చట్టంలో ఉంది. అయినప్పటికీ ప్రజలకు పాలన దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌ను వదిలి వెలగపూడి సచివాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలు అమరావతి పరిసర ప్రాంతాలకు తరలిపోయాయి. రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ పాలనంతా అక్కడి నుంచే సాగుతోంది. అయితే ఈ వ్యవహారం అంతా నీతి ఆయోగ్‌కు తెలిసినట్లు లేదు. అందుకే ఏపీ సీఎం ఇప్పటికీ హైదరాబాద్‌లోనే ఉన్నట్టు భావిస్తోంది.
వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానించాలన్న ప్రతిపాదన పై అధ్యయనానికి ముఖ్యమంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యునిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రధాని నామినేట్ చేసినట్టు తెలుపుతూ నీతి ఆయోగ్ లేఖ రాసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చిరునామాలో సచివాలయంలో ఉన్న వెలగపూడిని హైదరాబాద్‌లో ఉన్నట్లుగా రాయడం దుమారం రేగింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. మొత్తం 70 శాఖలకు లేఖలు రాసింది. సచివాలయం అడ్రస్ మారిందంటూ తెలిపింది. మరి ఇక నుంచి అయినా, వీరు కరెక్ట్ అడ్రస్ రాస్తారో లేదో...