కేంద్ర క్రీడా మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ ప్రారంభించిన ఫిట్‌నెస్ ఛాలెంజ్ సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దేశ వ్యాప్తంగా స్పోర్ట్స్, సినీ సెలబ్రిటీలు ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో పాల్గొని తాను కసరత్తు చేస్తున్న వీడియోని ట్వీట్ చేశాడు. దీంతో పాటు అతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఛాలెంజ్ చేశాడు. దీన్ని స్వీకరించిన ప్రధాని తాను యోగా చేస్తున్న వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పెట్టారు. అయితే ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించి సంచలన విషయం బయటకొచ్చింది. ప్రధాన మంత్రి చేసిన ఈ యోగా వీడియో కోసం ప్రభుత్వం ఏకంగా రూ.35 లక్షలు ఖర్చు చేసినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది.
అయితే ఈ ఖర్చు కేవలం ఈ వీడియో కోసం మాత్రమేకాదు.. అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం చేసిన కొన్ని యానిమేషన్ చిత్రాల కోసం కూడా వెచ్చించినట్లు తెలుస్తోంది. యోగా దినోత్సవం ప్రచారం కోసం నరేంద్ర మోదీ యోగా చేస్తున్నట్లుగా ఓ యానిమేషన్ వీడియోని చిత్రీకరించారు. అయితే దీనికి ముందుగా రూ.40 నుంచి 45 లక్షల వరకూ ఖర్చు జరుగుతుందని భావించినా.. తక్కువ ఖర్చు జరిగే చోట చిత్రీకరించి మొత్తాన్ని తగ్గించినట్లు సమాచారం. ఇది మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా యోగా దినోత్సవం కోసం ఇచ్చిన యాడ్‌లకు ఆయుష్ మినిస్ట్రీ దాదాపు రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు ఈ పత్రిక ప్రచురించింది. ప్రస్తుతం ఈ కథనం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. సోషల్‌మీడియాలో ఈ కథనం ప్రచారం కావడంతో ప్రధానిని నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం ఆ కథనం అవాస్తవమని వాదిస్తున్నారు.
అయితే ఈ విమర్శల పట్ల సమాచార ప్రసార శాఖ మంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ స్పందించారు. మోదీ ఫిట్‌నెస్ వీడియోను ప్రధాని కార్యాలయ వీడియోగ్రాఫర్ చిత్రీకరించారని తెలిపిన రాథోడ్.. డబ్బు ఖర్చు పెట్టారని వచ్చిన వార్తలు తప్పుడు కథనాలన్నారు. మోదీ ఫిట్‌నెస్ వీడియోల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మోదీకి ఫిట్‌నెస్ ఛాలెంజ్ విసరగా.. దానికి స్వీకరించిన మోదీ.. త్వరలోనే ఫిట్‌నెస్ వీడియో షేర్ చేస్తానని తెలిపారు. అందుకు అనుగుణంగానే.. యోగా దినోత్సవానికి వారం రోజుల ముందు ప్రధాని మోదీ తన ఫిట్‌నెస్ వీడియోను ట్వీట్ చేశారు.