స్వామి పరిపూర్ణానంద.. గత కొన్ని రోజులుగా మీడియాలో వినిపిస్తున్న పేరు. కత్తి మహేష్ మీద పోరాటం చేస్తా అని పిలుపిచ్చి, హైదరాబాద్ పోలీస్ చేత నగర బహిష్కరణకు గురయ్యారు. అయితే, నిన్న హైదరబాద్ వచ్చిన అమిత్ షా, పరిపూర్ణానందకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో స్వామి పరిపూర్ణానందకు లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దించే అంశంపై అమిత్‌షా సంఘ్ పరివార్ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపూర్ణానందను రాజకీయాల్లోకి తీసుకు వస్తే ఎలా ఉంటుందని ఆరా తీశారు. తమ అభిప్రాయాలు చెప్పాలని సమావేశంలో ఉన్నవారిని అడిగారు. ఇందుకు సమావేశంలోని వారు సానుకూలంగా స్పందించడంతో కరీంనగర్ లోక్‌సభ నియోజికవర్గం నుంచి పోటీ చేయమని కోరదామని అన్నారు.
పరిపూర్ణానంద అంశంపై సంఘ పరివార్ సంస్థలు పోరాటం చేయాలని, రాజకీయ పార్టీగా బీజేపీ తన వంతు పాత్రను పోషిస్తుందని అమిత్‌షా స్పష్టం చేశారు. ఈ విషయమై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారని, హిందువులంతా ఏకమై స్వామిజీకి పూర్తి మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపు నిచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వెనక్కి తగ్గవద్దని ఆదేశించినట్టు సమాచారం. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్ ను శిక్షించకుండా, పరిపూర్ణానందను ఏ విధంగా నగర బహిష్కరణ చేస్తారని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
అయితే మరో పక్క, కత్తి మహేష్ ను క్షమిస్తున్నానని శ్రీ పీఠం పరిపూర్ణానంద స్వామి శుక్రవారం అన్నారు. అతను ఓ బోయవానిగా మాట్లాడినా వాల్మీకిగా మారగలడని ఆకాంక్షించారు. ఉన్నత విద్యావంతులు కూడా రామనామం గురించి తెలుసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అమిత్ షా, పరిపూర్ణానందకు ఎంపీ సీట్ ఆఫర్ ఇచ్చిన నేపధ్యంలో, కత్తి మహేష్ కూడా ఎదో ఒక ఎంపీ సీట్ ఇస్తే బాగుంటుందని, కొంత మంది వ్యంగ్యంగా సటైర్ వేస్తున్నారు.