ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సంకల్పానికి వరుణుడు కూడా తోడయ్యాడు. గత పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతూ ఉండటంతో, రైతులు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు ముందు చూపుతో పని చేసిన ఇంకుడు గుంటలు, పంట కుంటలు, నీటి గుంటలు చెక్ డాంలు, పూడిక తీసిన చెరువులతో, రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలాలు నిల్వలు బాగా పెరిగాయి. మరో పక్క ఎగువ ప్రాంతాల వరదనీరొస్తోంది. మహారాష్ట్ర, కర్నాటకల్లో భారీ వర్షాల వల్ల దిగువన ఉన్న కృష్ణా, తుంగభద్ర నదులు వరద నీటితో పోటెత్తుతున్నాయి. స్థానికంగా మునేరు, వైరా వాగులతో పాటు, పట్టిసీమ ఎత్తిపోతల నుంచి గోదావరి నీరు 7,700 క్యూసెక్కుల నీరు కృష్ణకు వస్తోంది. ఫలితంగా శనివారం నాటికి ప్రకాశం బ్యారేజి సామార్థ్యం 12 అడుగుల మించి వరద నీరు చేరుతుండటంతో అదనపు నీటిని ఎప్పటికప్పుడు తూర్పు డెల్టా, పశ్చిమ డెల్టా కాల్వలకు, బ్యారేజ్ గేట్లూ ఎత్తి దిగువకు వదులుతున్నారు. నదికి 14,941 క్యూసెక్కుల చొప్పున నీరు వస్తుండగా, 10,971 క్యూసెక్కుల చొప్పున తూర్పు, పశ్చిమ డెల్టాలకు విడుదల చేస్తున్నారు.
మరో పక్క గోదావరి కూడా ఉదృతంగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. రెండు రోజులుగా భద్రాచలం వద్ద నిలకడగా ఉన్న గోదావరి నీటిమట్టం శనివారం సాయంత్రం 30.30 అడుగులకు పెరిగింది. శుక్రవారం సాయంత్రం 29.70 అడుగులు ఉన్న నీటిమట్టం శనివారానికి పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 9.70 అడుగులకు నీటిమట్టాన్ని స్థిరీకరించారు. బ్యారేజీకి చెందిన 175 గేట్లను ఎత్తివేసి సముద్రంలోకి 2,98,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ధవళేశ్వరం, విజ్జేశ్వరం వద్ద బ్యారేజీకి చెందిన గేట్లను 0.69 మీటర్ల ఎత్తుకు లేపారు.
ఉత్తరాంధ్ర నర్సీపట్నం డివిజన్‌లోని ప్రధాన జలాశయాల్లో నీటిమట్టాలు ఆశాజన కంగా ఉన్నాయి. తాండవ రిజర్వాయర్ సాధారణ నీటిమట్టం 380 అడుగులు కాగా, ప్రస్తుతం 366.5 అడుగుల నీటిమట్టం ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 362 అడుగుల నీటిమట్టం ఉండేది. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అదనంగా 3.5 అడుగులు పెరిగింది. ప్రస్తుతం జలాశయంలో 2680 ఎంసిఎఫ్‌టిల ఉండగా గత ఏడాది ఇదే సమయానికి 1920 ఎంసిఎఫ్‌టిలు ఉండేది. ప్రస్తుతం జలాశయంలోకి రోజుకు 200 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉంది.
శనివారం కృష్ణా నది ఎగువున వున్న ఆల్మట్టి డ్యాం లోకి 90,886 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఆల్మట్టి డ్యాం పూర్తి స్థాయి సామర్థ్యం 129.72 టిఎంసిలు కాగా ప్రస్తుతం 83.78 టిఎంసిల నమోదైంది. మరో 45 టిఎంసిలు వస్తే దిగువకు వరదనీరు వచ్చే అవకాశం వుంది. తుంగభద్ర నదిలోకి కూడా భారీగా వరద ప్రవాహం నమోదైంది. 76,527 క్యూసెక్కుల వరదనీరు డ్యాంలోకి వచ్చి చేరుతోంది. తుంగభద్ర డ్యాం పూర్తి స్థాయి సామర్థ్యం 100.8 టిఎంసిలు కాగా ప్రస్తుతం 66 టిఎంసిలకు చేరుకుంది. మరో 34 టిఎంసిలు తుంగభద్ర డ్యాంలోకి వస్తే దిగువకు వదులుతారు. గతేడాది ఇదే సమయానికి కేవలం 14.3 టిఎంసిలు నీరు మాత్రమే అందుబాటులో వుండేది.