ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు మీడియాతో మాట్లాడారు. అయితే, చాలా రోజుల తరువాత మెగాస్టార్ చిరంజీవి పై వ్యాఖ్యలు చేసారు. కొన్ని రోజుల క్రిందట, చిరంజీవి తెలుగుదేశం పార్టీలో చేరతారనే సంకేతాలు వచ్చాయి. అయితే అనూహ్యంగా బీజేపీ, పవన్ ను తెర మీదకు తీసుకురావటం, పవన్ ఆక్టివ్ అవ్వటంతో, చిరంజీవి తన తమ్ముడు పార్టీలో చేరతారనే అనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో చిరంజీవి పై, ఈ రోజు చంద్రబాబు వ్యాఖ్యలు చేసారు. మాజీ సియం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరటం పై, విలేఖరులు అడగగా, చంద్రబాబు స్పందించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ పెట్టారు.. ప్రజలు ఆదరించలేదు.. మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు.. కానీ చిరంజీవి కాంగ్రెస్‌లో ఉన్నారో లేదో స్పష్టత లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు... వీరంతా కష్ట కాలంలో పోరాడాల్సింది, ఎవరూ ముందుకు రాలేదని అన్నారు.
కేంద్రంతో సమస్యలున్నా... పోలవరం ప్రాజెక్ట్ ఆగదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తనపై బీజేపీ, వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వాళ్లతో పవన్‌కల్యాణ్ కూడా కలిశారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పుట్టినవారు కూడా పోలవరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసుల విషయంలో లాలూచీపడి.. రాష్ట్ర ప్రయోజనాల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వంలో చేరడానికి వైసీపీ ఆశ పడుతోందని తెలిపారు. పార్లమెంట్‌లో పోరాటం నుంచి తప్పించుకునేందుకే వైసీపీ డ్రామాలాడుతోందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. పోరాడే సమయంలో వైసీపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేశారని ప్రశ్నించారు. ఎన్నికలు రాని రాజీనామాలు ఎందుకు? అని నిలదీశారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు ఎందుకు? అని అడిగారు.
వచ్చే నెలలో అమరావతికి ఓ రూపం వస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక బెస్ట్ టీమ్ అని దేశంలో నిరూపితమైందని చెప్పారు. కోర్టుల్లో, ట్రిబ్యునల్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ప్రపంచ బ్యాంకుకు సైతం తప్పుడు ఫిర్యాదులు చేశారని వాపోయారు. గ్రామదర్శిని పేరుతో జనవరి వరకు ప్రజల వద్దకు వెళ్తామని చెప్పారు. గ్రామదర్శిని కార్యక్రమంలో 75చోట్ల తాను పాల్గొంటానని సీఎం వెల్లడించారు. అన్న క్యాంటీన్ అద్భుతంగా విజయవంతమైందని చంద్రబాబు అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఈనెల 16వ తేదీకి 1500రోజులు పూర్తవుతుందని వెల్లడించారు. విభజన అనంతరం రాష్ట్ర పరిస్థితి ఆందోళన కలిగించిందన్నారు. సంతృప్తితో కూడిన అభివృద్ధి కోసం మా ప్రయత్నం చేశామని తెలిపారు. రైతుల రుణమాఫీ కోసం రాష్ట్ర నిధులు ఖర్చు చేస్తే.. కేంద్రం రెవెన్యూ లోటులో కోత పెట్టిందని ఆరోపించారు.