amaravati outer 15122016

సీఆర్‌డీఏ పరిధిలో చుట్టూ వున్న పట్టణాలు, జాతీయ రహదారులను అనుసంధానం చేసేలా బాహ్య వలయ రహదారి (ఔటర్ రింగ్) నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. ప్రజా రాజధాని ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో వుంచుకుని అంతర్, బాహ్య వలయ రహదారులు ఉండాలని చెప్పారు.

బుధవారం ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ వారాంతపు సమీక్షా సమావేశం ప్రధానంగా అంతర్, బాహ్య వలయ రహదారులపైనే సాగింది. ఈ రహదారులకు సంబంధించి సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ 3 ఆప్షన్లను ముఖ్యమంత్రి ముందు వుంచారు. వాటిపై కూలంకుశంగా చర్చించిన ముఖ్యమంత్రి అంతిమంగా రాజధాని పరిధిలో చుట్టూ ఉన్న పట్టణాలు, జాతీయ రహదారులను కలిపేలా బాహ్య వలయ రహదారి నిర్మాణం ఉండాలని, రెండు రోజులలో దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసి ఇస్తే త్వరలో జరిగే శాఖాధిపతుల సమావేశంలో, మంత్రిమండలి సమావేశంలో చర్చించి తుది నిర్ణయానికి రావచ్చునని ముఖ్యమంత్రి చెప్పారు.

తెనాలి, గుడివాడ, నూజివీడు, సత్తెనపల్లి వంటి పట్టణాలతో పాటు చెన్నయ్-కలకత్తా జాతీయ రహదారి, విజయవాడ-ముంబై జాతీయ రహదారి, విజయవాడ-జగదల్‌పూర్ జాతీయ రహదారితో పాటు కొత్తగా నిర్మించబోయే అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ రహదారికి అనుసంధానంగా వుండేలా ప్రజారాజధానిలో బాహ్య వలయ రహదారి ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. బాహ్యవలయ రహదారి నిర్మాణం జరిగితే చుట్టూ వున్న ప్రాంతాలన్నీ అభివృద్ధి చెంది అవన్నీ కాలగమనంలో రాజధాని నగరంలో కలిసిపోతాయని వివరించారు. రానున్న కాలంలో రాజధాని అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ శాటిలైట్ టౌనషిప్స్ అభివృద్ధి చెందుతాయని అన్నారు. బాహ్యవలయ రహదారిపై తుది ప్రణాళిక సిద్ధమైతే దీనిపై సవివర ప్రాజెక్టు నివేదికను తయారుచేసి కేంద్రానికి అందించాల్సి ఉంటుందని చెప్పారు. బాహ్య వలయ రహదారి లోపల ప్రస్తుతం వుండే జనాభా 30 నుంచి 35 లక్షల వరకు వుంటుందని, ఇది 1995లో ఇది హైదరాబాద్ జనాభా అని గుర్తుచేశారు.

రాజధాని పరిధిలోని రెండు ప్రధాన నగరాలు, చుట్టూ వుండే పట్టణాలు, కొత్తగా వచ్చే శాటిలైట్ టౌన్‌షిప్‌లకు 30 లేదా 45 నిమిషాల వ్యవధిలో చేరుకునేలా రవాణా వ్యవస్థ వస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. అంతర్ వలయ రహదారి నుంచి నగరానికి దారితీసే అంతర్గత రహదారులన్నీ మలుపులు లేకుండా నేరుగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. అమరావతి నిర్మాణంతో పాటే చుట్టూ వున్న తెనాలి, మంగళగిరి, సత్తెనపల్లి, నూజివీడు, గుడివాడ, మచిలీపట్నం, తాడేపల్లి వంటి ప్రాంతాలలో సమాంతర అభివృద్ధి జరగాలని, అధికారులు దీనిపై ఇప్పటినుంచే తగిన కార్య ప్రణాళికలను రూపొందించుకోవాలని చెప్పారు.

రాజధాని పరిధిలో భూసమీకరణ ప్రక్రియ మొత్తం డిసెంబరు నెలాఖరులోగా ముగుస్తుందని, రెండు గ్రామాలు మినహా దాదాపు అన్నిచోట్లా ప్లాట్ల కేటాయింపు పూర్తవుతుందని సీఆర్డీయే కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. అంతర్జాతీయ విద్యాలయాల కోసం టెండర్లు పిలవగా పేరొందిన సంస్థలు ఆ ప్రక్రియలో పాల్గొన్నాయని చెప్పారు. ప్రపంచంలో పేరొందిన మొదటి 10 అక్రిడేటెడ్ విద్యాసంస్థలతో సంప్రదింపులు జరిపి అమరావతిలో వారు తమ శాఖలను నెలకొల్పుకునేలా అన్ని అవకాశాలను కల్పిద్దామని ముఖ్యమంత్రి చెప్పారు. ముందు విద్యాలయాలు, కళాశాలలు, ఆస్పత్రులు, నక్షత్ర హోటళ్లు వస్తే నగరాభివృద్ధి శరవేగంతో జరుగుతుందని అన్నారు. అమరావతిలో నిర్మాణాలు ప్రారంభించాలని హిల్టన్, మారియట్, లీలా గ్రూపు వంటి అంతర్జాతీయ సంస్థలను కోరాలని సూచించారు. షెట్టీ గ్రూపు, అమృత, విట్ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు ఇప్పటికే వచ్చాయని అధికారులు వివరించారు. రాజధానిలో జస్టిస్ సిటీ, ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ వంటి నవ నగరాల అభివృద్ధిపై ఇక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుపై అంతర్జాతీయంగా పేరొందిన సంస్థలతో మాట్లాడాలని కోరారు. రానున్న కొద్ది కాలంలో జాతీయ క్రీడలకు అమరావతి వేదికగా నిలిచేలా స్పోర్ట్స్ సిటీని సిద్ధంచేయాలన్నారు. ప్రతి మాసం ఏదో ఒక స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించడం ద్వారా అమరావతిని నిత్యం వార్తలలో నిలపాలని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read