కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనగళం వినిపించేందుకు దక్షిణాది రాష్ట్రాలు ఏకమయ్యాయి. మంగళవారం కేరళలోని తిరువనంతపురంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థికశాఖ కార్యదర్శుల సమావేశం ఇందుకు వేదికైంది. 15వ ఆర్థిక సంఘం నిబంధనల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను హరిస్తున్న విధానంపై, 15వ ఆర్థిక సంఘం నిబంధనల్లో 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.. దక్షిణ భారత దేశంలో, ప్రాంతీయ పార్టీలను నాశనం చేసే ప్లాన్ ఇది అంటూ, కేంద్రం పై విమర్శలు గుప్పించారు...
రాష్ట్రాల ఆర్థికవ్యవస్థల పై సూక్ష స్థాయిలో కూడా పెత్తనం చలాయించడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఈ సమావేశంలో చర్చించారు... సైద్థాంతిక పునాదులు బలపర్చుకోవలన్న ప్రయత్నమూ ఇందులో దాగుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ‘‘కేంద్రాన్ని మేం కోరుతున్నది ఒక్కటే.. ఈ రూల్స్ మార్చండి. కొత్త విధివిధానాలు తీసుకురండి’’ అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ డిమాండ్ చేశారు. ఈ సదస్సు కేంద్రానికి కనువిప్పు కావాలని పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి నారాయణస్వామి అన్నారు. టీఓఆర్ రూపంలో రాయితీలు కోసేయబోతున్నారని కర్ణాటక మంత్రి బైరే గౌడ ఆరోపించారు. ఈ టీఓఆర్ వల్ల తమ రాష్ట్రం దాదాపు రూ 80,000 కోట్లు నష్టపోతుందని కేరళ ఆర్థికమంత్రి టీఎం థామస్ ఐజాక్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. 15వ ఆర్థికసంఘం విధివిధానాలను యథాతథంగా కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చే అయిదేళ్లలో రూ.24,340 కోట్లు నష్టపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగపరంగా తప్పనిసరి అయిన రెవెన్యూలోటు భర్తీని యథాతథంగా కొనసాగించాలని రాష్ట్రాలకు రెవెన్యూలోటు ఇవ్వాలా? వద్దా? అన్న అంశంపై అధ్యయనం చేసే బాధ్యతను 15వ ఆర్థికసంఘం విధివిధానాల్లో చేర్చడం సరికాదని స్పష్టం చేశారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి మాట్లాడుతూ మంచి పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలను శిక్షించి, పనితీరు పేలవంగా ఉన్న రాష్ట్రాలకు నిధులందిస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ సహకార సమాఖ్యస్ఫూర్తి గురించి మాట్లాడతారని, కానీ ఆచరణలో కనిపించేది నియంతృత్వమని ఆరోపించారు. ఈ నెలాఖరులో గానీ, లేక మే నెల మొదటివారంలో గానీ విశాఖపట్నంలో తదుపరి సమావేశం జరుగుతుందని ప్రకటించారు.