ఇప్పుడు రాష్ట్రంలో ఎవరి నోట విన్నా, "ఆపరేషన్ గరుడ" అనే టాపిక్ మాత్రమే వినిపిస్తుంది... ఢిల్లీ పెద్దలు, ఇక్కడ చంద్రబాబుని ఇబ్బంది పెట్టటం కోసం, మన వాళ్ళతోనే, ఎలా ఆయన్ని ఇబ్బంది పెట్టి, రాష్ట్రంలో అనిశ్చితి తేవటం ఈ ఆపరేషన్ ఉద్దేశం... అయితే, ఇప్పుడు మీరు వినేది కూడా ఆపరేషన్ గరుడే, కాని ఇది రాష్ట్రాన్ని కాపాడే ఆపరేషన్... నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నూతనంగా నిర్మించిన అసెంబ్లీ వద్ద ‘‘గరుడ కమాండ్ కంట్రోల్ రూమ్’’ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏర్పాటు చేయని విధంగా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, సభాపతి, ముఖ్యమంత్రి వరకు తమ ఇళ్ల వద్ద నుంచి శాసనసభ ప్రాంగణానికి చేరుకునే వరకు కంటికి రెప్పలా ఈ కంట్రోల్ రూమ్ కాపాడుతుంది. గరుడ పక్షికి అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఆకాశంలో తిరుగుతూ కిలోమీటర్ల కొద్ది తన డేగకళ్లతో నిఘాపెట్టేలా దానిని తీర్చిదిద్దారు. రూరల్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు స్వీయ పర్యవేక్షణలో డీఎస్పీలు సుధాకర్, రాజశ్రీ, ఐటీకోర్ సీఐ రాజశేఖర్ల నేతృత్వంలో 50 మంది నిష్టాతులైన సిబ్బంది 24 గంటలు గరుడ విభాగం భద్రతను పర్యవేక్షిణ చేస్తుంది... ఈ విభాగం ప్రధానంగా ఉపయోగించేది, యాప్, జీపీఎస్, సోషల్ మీడియా ఎనాలిసిస్, రేడియో ఓవర్ ఇంటర్నెట్ కాల్ , ఎంటర్ప్రైజెస్ సెర్చు 24/7, డ్రోన్ కెమెరాలు, 200 దాకా సిసి కెమెరాలు.. బాడీ కెమెరాలు, న్యూస్వాచ్, అసెంబ్లీసెల్, ఇంటెలిజెన్స్ టీమ్స్, క్రమశిక్షణ బృందాలు ఇలా అనేక కొత్త విభాగాలను రూపొందించి వాటిని సాంకేతికతతో గరుడకు అనుసంధానం చేశారు...
నిన్న ఈ కంట్రోల్ రూమ్ ని, స్పీకర్ కోడెల సందర్శించారు... ఈ సందర్భంగా అసెంబ్లీ డ్యూటీలో భాగంగా ఉత్తమ సేవలందించిన పోలీసులకు స్పీకర్ కోడెల అభినందన పత్రాలు అందించారు. అనంతరం గరుడ కంట్రోల్ రూమ్ పరిధిలో సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి cc కెమెరా వ్యవస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే అసాంఘిక కార్యకలాపాలకు తావు ఉండదన్నారు. డోన్ కెమెరాల పనితీరు బాగుందని అయితే శాటిలైట్ ఉపయోగించుకోంటే మరింత నాణ్యమైన సేవలు అందుతాయన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉంటుందన్నారు. టెక్నాలజీ ఉపయోగించుకోని త్వరలోనే ఏపీలో పోలీస్ కనబడని పోలీసింగ్ వస్తుందన్నారు.