రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలుపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సాగిస్తున్న ఉధృతమైన దాడికి బలం చేకూర్చే మరో ఆయుధం దొరికింది.. 36 రాఫెల్ విమానాల ఒప్పందం కుదరాలంటే అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ డిఫెన్స్ (ఆర్డీ)సంస్థను ఆఫ్సెట్ భాగస్వామిగా ఒప్పుకోవాల్సిందేనని, డీల్ సాకారం కావడానికి రిలయన్స్‌తో జాయింట్ వెంచర్ తప్పనిసరి అని ఆ జెట్ల తయారీ సంస్థ దసో ఏవియేషన్ అంతర్గతంగా అంగీకరించినట్లు తాజాగా బయటపడింది. దసోలోని ఓ ఉన్నతాధికారి తన సిబ్బందికి ఈ విషయమై స్పష్టతనిచ్చి దీన్ని ధ్రువపర్చినట్లు వెల్లడయ్యింది.
ఈ బాంబు పేల్చినది కూడా ఫ్రెంచి పరిశోధనాత్మక వార్తాపత్రిక మీడియాపార్టే. ‘‘ఈ కాంట్రాక్ట్ చేజిక్కించుకోవాలంటే రిలయన్స్‌ను అంగీకరించడం అనివార్యం. ఇది ఒక వాణిజ్యపరమైన రాజీ’’ అని దసో డిప్యూటీ సీఈవో లోయిక్ సెగాలెన్ 2017 మే 11వ తేదీన నాగ్‌పూర్‌లో దసో ప్రతినిధులకు ఆ అధికారి చెప్పినట్లు, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నట్లు మీడియాపార్ట్ లో తాజాగా ప్రచురితమైన కథనం వెల్లడించింది. సెగాలెన్ దసో సంస్థలో అధికార శ్రేణిలో రెండో స్థానంలో ఉన్న అత్యంత కీలకమైన వ్యక్తి. ‘‘ఇది మనకి ఓ ఆబ్లిగేషన్.. భారమైనా అనివార్యం. రాఫెల్ ఇండియా డీల్‌లో రిలయన్స్‌ను మనం భాగస్వామిగా కొనసాగించాలి’’ అన్నారాయన.
ఈ వివరణతో రాఫెల్లో అనిల్ అంబానీకి అనుకూలంగా కథ సాగినట్లు మరోసారి స్పష్టమయ్యింది. దసో సంస్థ కూడా తమకు తాముగా అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంపిక చేసుకుందని వివరణ ఇచ్చినా దాని వెనుక ఒత్తిడి ఉన్నట్లు ఈ కథనం బయటపెడుతోంది. రిలయన్స్ సంస్థను ఆఫ్సెట్ భాగస్వామిగా భారత ప్రభుత్వమే ఎంపిక చేసుకుందని, ఇందులో తమకు వేరే ప్రత్యామ్నాయం లేకపోయిందని, దసో సంస్థ నేరుగా రిలయన్స్‌తోనే సంప్రదింపులు జరుపుకోవాల్సి వచ్చిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్స్ హోలాంద్ గత నెల 22న మీడియా పార్ట్ ఇంటర్వ్యూలోనే బయటపెట్టారు. మోదీ సర్కార్‌ను గుక్క తిప్పుకోలేకుండా చేసిన ఆ ఇంటర్వ్యూ ఎన్నికల ప్రచారాంశాల్లో అతి ముఖ్యమైనదిగా మారిపోయింది.