ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్న నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ మంత్రివర్గంలో ఉన్నప్పుడే ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరామారావు కుమార్తె అయిన భువనేశ్వరీ దేవిని 1981, సెప్టెంబర్ 10వ తేదీన వివాహం చేసుకున్నారు. భువనేశ్వరి-బాబు వివాహానికి నేటితో 36 వసంతాలు.
తెలుగు సినీ రంగంలో అగ్ర హీరో ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరితో చంద్రబాబు పెళ్లి ఎవరు కుదిర్చారు.? ఎన్టీఆర్తో చంద్రబాబునాయుడి పరిచయం ఎప్పుడు? పెళ్లికి ఎన్టీఆర్ కట్నం ఏమైనా ఇచ్చారా?... ఇలాంటి ఆసక్తికరమైన వ్యక్తిగత విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, కొన్ని రోజుల క్రితం, శాసనమండలి ఆవరణలోని విలేకరులతో పంచుకున్నారు.
జయకృష్ణ, విశ్వేశ్వరరావు పెళ్లి ప్రతిపాదన తెచ్చారు..
ఒకసారి నా ఇంటికి ముఖ్యమంత్రి అంజయ్యను... రామారావు గారిని పిలిచి వారి మధ్య సమావేశం ఏర్పాటు చేశాను. వర్తమాన అంశాల గురించి వారు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత జయకృష్ణ, మా బంధువు విశ్వేశ్వరరావు కలిసి ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరితో పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చారు. ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు కూడా వారితో ఉన్నారు. మా పెళ్లి కుదిర్చింది వీరే. నేను సినిమా శాఖకు మంత్రిగా ఉండడం ఎన్టీఆర్ కుటుంబంతో సంబంధం ఏర్పడడానికి ఒక కారణం.
ఎన్టీఆర్ మీకు కట్నమేమైనా ఇచ్చారా?
‘నేను అడగలేదు. ఆయన ఇవ్వలేదు. అసలా ప్రసక్తే రాలేదు. నేను రాజకీయ నాయకుడిని కాబట్టి పెళ్లి మాత్రం గ్రాండ్గా చేయాలని అడిగాను. రామారావుగారు ఒప్పుకొన్నారు. మద్రా్సలో ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ కుమార్తెను పెళ్లి చేసుకుంటున్నానని మా వాళ్లు ఇంటింటికీ వివాహ పత్రికలు పంచారు’ ‘పెళ్లయ్యాక హైదరాబాద్లో వెంగళరావు పార్కు దగ్గర కాపురం పెట్టాను. అక్కడ నాకు ఇబ్బందిగా ఉందనుకుని జూబ్లీహిల్స్లో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ఉన్న ఇంటి స్ధలంలో నాకు ఇల్లు కట్టిస్తానని రామారావుగారు నాకు చెప్పారు. వద్దని చెప్పాను. రామారావుగారు ఎవరికీ ఇల్లు కట్టిస్తానని చెప్పలేదని, ఆయనంతట ఆయన అడిగినప్పుడు ఒప్పుకోవడం మంచిదని మా అత్తగారు నా భార్య దగ్గర గొడవ పెట్టారు. అయినా, వద్దని చెప్పాను. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయాను. ఇల్లు ఖాళీ చేసి మెహిదీపట్నంలో ఒక చిన్న ఇంటికి మారాను. అప్పటికి జూబ్లీహిల్స్లో బాలకృష్ణ ఇల్లు కట్టుకున్నాడు. కానీ ఆయన మద్రా్సలో ఉండేవాడు. దానితో రామారావుగారు మమ్మల్ని ఆ ఇంటికి మార్పించారు. అక్కడ ఇల్లు వద్దనుకున్నా చివరకు అదే స్ధలంలో కట్టిన ఇంట్లో ఉండక తప్పలేదు.’