తెలుగుదేసం పార్టీ మూడు రోజుల పాటు నిర్వహించిన మహనాడులో, అనేక విషయలు చర్చించారు. ప్రతిపక్షాలు మాత్రం, భజన చేసుకున్నారు అని, స్వీట్లు తిన్నారు అంటూ ఎగతాళి చేసినా, ఇక్కడ మాత్రం రాష్ట్ర సమస్యల దగ్గర నుంచి, దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర దాకా చర్చించారు. ఈ మొత్తం మూడు రోజుల మహానాడులో, జేసి దివాకర్ రెడ్డి స్పీచ్ మాత్రం హైలైట్ గా నిలిచింది. జన్మభూమి కమిటీల ద్వారా జరుగుతున్న పనులు, వాటి వల్ల వస్తున్న చెడ్డ పేరుతో పాటు, చంద్రబాబు ఎక్కువ సేపు చేస్తున్న టెలి కాన్ఫరెన్స్ ల పై కూడా, జరుగుతున్న వాస్తవాలు చంద్రబాబు ముందు ఉంచారు. జేసి దివాకర్ రెడ్డితో పాటు, మహానాడుకు వచ్చిన కొంత మంది కార్యకర్తలు కూడా, జన్మభూమి కమిటీల వల్ల, ప్రభుత్వానికి వస్తున్న చెడ్డ పేరును చంద్రబాబు వద్దకు తీసుకువెళ్ళారు. అంతే, మహానాడు పూర్తయిన మరుసటి రోజే చంద్రబాబు దీని పై రివ్యూ చేసారు.. అన్ని విషయాలు చర్చించి 24 గంటల్లోనే నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో అర్హులైన పేదలకు పింఛన్ల విషయంలో అన్యాయం జరగకూడదనే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. జన్మభూమి కమిటీల అనుమతితో సంబంధం లేకుండా అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వనున్నారు. మొత్తం 3.25లక్షల మందికి కొత్తగా ఈ విధంగా ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఎవరికైనా పింఛను ఇవ్వాలంటే.. ఆ గ్రామంలోని జన్మభూమి కమిటీ దానికి అనుమతిస్తూ లేఖ ఇవ్వాలి. అయితే కొన్నిచోట్ల జన్మభూమి కమిటీలు అర్హతలున్నవారిని ఎంపికచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇక నుంచి పింఛన్ల ఎంపిక ప్రక్రియను రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్)ద్వారా చెయ్యనున్నారు.
పింఛన్ల కోసం మీ సేవ, ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నవారు పెద్దసంఖ్యలో ఉన్నారు. వీరందరి దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా రియల్‌టైమ్ గవర్నెన్స్‌లోకి తీసుకుంటున్నారు. ఈ రెండురోజుల్లోనే మొత్తం 3.25లక్షల మంది అర్హులను రియల్‌టైమ్ పాలన ద్వారా ఎంపిక చేయబోతున్నారు. 2.5 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు సమాచారం ఇచ్చే ప్రక్రియ మొదలైంది. కొత్త విధానంలో పింఛన్లు అందిచేందుకు వీలుగా జీవో 135లో కొన్ని మార్పులు చేస్తున్నారు. ఈ జీవోలో ఉన్న విధి, విధానాల ప్రకారం జన్మభూమి కమిటీ సభ్యులు ఆమోదించినవారికే కొత్త ఫించన్లు ఇవ్వాలి. అలాగే టెలీకాన్ఫరెన్స్‌లు కూడా, వారానికి ఒకే రోజు ఉండే విధంగా, తద్వారా అధికారులు ఎక్కువ సేపు ఫీల్డ్ లో ఉండే విధంగా కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.