నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో హైకోర్టు నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు హైదరాబాద్‌లోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టును అమరావతిలో లేదా ఆంధ్రాలో వేరే ఏదయినా ప్రాంతంలో ఏర్పాటు చేసుకొనేవరకు కూడా ఉమ్మడి హైకోర్టుని విడదీయడానికి కానీ, విడదీసి హైదరాబాద్ లేదా వేరే ఎక్కడయినా ఏర్పాటు చేయడానికి గానీ విభజన చట్టం ప్రకారం వీలులేదని గతంలోనే ఉమ్మడి హైకోర్టు తేల్చిచెప్పింది.
కాని, మన రాష్ట్రం నుంచే అన్నీ ఉండాలి అనే ఉద్దేశంతో, అమరావతిలో హైకోర్టు నిర్మాణానికి ముహూర్తం ఖరారు చేసారు చంద్రబాబు. అమరావతిలో హైకోర్టు నిర్మాణాన్ని ఈ ఏడాది ఆగస్టు 17న ప్రారంభించి... 2019 ఏప్రిల్ మూడో తేదీనాటికి పూర్తి చేసేలా ప్రణాళిక ఖరారైంది. రాజధానిలో జస్టిస్ సిటీ ఏర్పాటు చేయబోయే శాఖమూరులో హైకోర్టు నిర్మాణం జరగనున్నది. హైకోర్టు భవనాన్ని జీ+4 అంతస్తులుగా నిర్మిస్తారు. వీటికి సంబంధించిన డిజైన్లను నార్మన్ ఫోస్టర్ సంస్థ అందిస్తోంది. ఈ నెల 22వ తేదీన సీఎం చంద్రబాబుతో సంస్థ ప్రతినిధులు సమావేశమవుతారు.
మొదటి విడతలో, జస్టిస్ సిటీలో హైకోర్టు మాత్రమే నిర్మిస్తారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మిచనున్న జస్టిస్ సిటీలో, న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు, శిక్షణ సంస్థలు, ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలలు, న్యాయసంస్కరణ కేంద్రాలు, జస్టిస్ మ్యూజియంలు, గ్రంథాలయాల వంటి ఎన్నెన్నో ప్రత్యేకతల సమాహారంగా ఈ నగరం రూపొందనుంది. సంక్షిప్తంగా 6 ప్రధానాంగాలతో ఏర్పడనున్న ఈ జస్టిస్ సిటీ ఏర్పడనుంది. జస్టిస్ సిటీలో ప్రధానంగా.. ఎడ్యుకేషనల్ - ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్లు, కోర్టులు- ట్రిబ్యునళ్లు, జస్టిస్ ఫ్యాక్టరీలు, ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలలు- మొబైల్ స్టేషన్లు, న్యాయసంస్కరణలు- లెజిస్లేటివ్ డ్రాఫ్టింగ్ కేంద్రాలు, జస్టిస్ మ్యూజియంలు- గ్రంథాలయాలు’ అనే ఆరు విభాగాలుంటాయి. న్యాయవ్యవస్థకు సంబంధించిన సకల అంశాలు, విభాగాలు, సంస్థలతో ఏర్పాటై సమాజంలోని ప్రతి ఒక్కరూ సులభంగా సత్వరన్యాయం పొందేందుకు ఉపకరించడమే లక్ష్యంగా జస్టిస్ సిటీకి రూపకల్పన చేస్తున్నారు.