amaravati ring roads 30112016

మెట్రో నగరాలను తలదన్నేలా నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంతర, బాహ్య, ప్రాంతీయ రహదారుల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు నిర్దేశించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా బీజింగ్ తరహాలో రింగ్ రోడ్ల ఏర్పాటుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.

రాజధాని అమరావతిలో చేపట్టనున్న అంతర, బాహ్య, ప్రాంతీయ వలయ రహదారుల నిర్మాణంపై బుధవారం వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. మౌలిక వసతులు కల్పించకుండా రాజధాని ప్రాంతం అభివృద్ధి అసాధ్యమని అన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దశలవారీగా మౌలికవసతులు కల్పించాల్సిన అవసరం వుందన్నారు. ఇందులో భాగంగా రింగ్ రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

రింగ్ రోడ్లు సాగేదిలా..
రాజధాని చుట్టూ మూడు రింగ్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు కొలిక్కివచ్చాయి. ఇన్నర్, ఔటర్, రీజినల్ రింగ్ రోడ్లుగా పిలిచే వీటిని మొత్తం 454.5 కి.మీ మేర నిర్మించాల్సివుంది. 15 కి.మీ పరిధిలో 94.5 కి.మీ. మేర ఇన్నర్ రింగ్ రోడ్డు, 25 కి.మీ. పరిధిలో 150 కి.మీ పొడవైన ఔటర్ రింగ్ రోడ్డు, 34 కి.మీ. పరిధిలో 210 కి.మీ. రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటు కానుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు లోపల రాజధాని నగరంతో సహా 1,36,000 ఎకరాల ప్రాంతం, ఔటర్ రింగ్ రోడ్డు లోపల 4,73,000 ఎకరాల ప్రాంతం, రీజినల్ రింగ్ రోడ్డు 9 లక్షల ఎకరాల ప్రాంతం కలిగి వుంటుంది.

ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే గన్నవరం విమానాశ్రయానికి రాజధాని ప్రాంతం నుంచి మరింత వేగంగా చేరుకోవచ్చు. ఐఆర్‌ఆర్ కాచవరం, వైకుంఠపురం, పెదపరిమి, తాడికొండ, చినకాకాని, పెదవడ్లపూడి, నూతక్కి, తాడిగడప, ఎనికేపాడు, నున్న, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం మీదుగా వెళ్తుంది. విజయవాడ నగరంపై రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఐఆర్ఆర్ ఉపకరిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు కోసం మైలవరంలో సొరంగ మార్గం నిర్మించాల్సి వుంది. ఇది ఐదో నెంబర్ జాతీయ రహదారిని కలుపుతూ గుంటూరు, తెనాలి, కంచికచర్ల మీదుగా వెళ్లనుంది.
స్థూలంగా అమరావతి ఇది.

అమరావతి రాజధాని ప్రాంతం స్థూలంగా ఇలా వుండనుంది. దీని విస్తీర్ణం మొత్తం 8,603 చ.కి.మీ. 2 మెగా నగరాలు, 9 పట్టణాలు సహా 12 అర్బన్ నోడ్స్ వుంటాయి. మల్టీ మోడల్ కనెక్టివిటీ దీని ప్రత్యేకత. ఐదు జాతీయ రహదారులు, పది రాష్ట్ర రహదారులు, ఐదు రైల్వే జంక్షన్లు, 4 జాతీయ జల మార్గాలు, రెండు ప్రత్యేక రవాణా కారిడార్లు, లాజిస్టిక్ హబ్స్-పార్క్‌లు, హైస్పీడ్ రైల్ కారిడార్, అంతర్జాతీయ విమానాశ్రయం, 94 కి.మీ. ఇన్నర్ రింగ్ రోడ్డు, 210 కి.మీ. ఔటర్ రింగ్ రోడ్డు, విశాఖ-చెన్నయ్ పారిశ్రామిక ఆర్ధిక కారిడార్, 217 చ.కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ డెవలప్‌మెంట్, కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం కలిగి వుంటుంది.

అంతర, బాహ్య, ప్రాంతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా కృష్ణానదిపై భారీ వంతెనలు నిర్మించాల్సి వుంది. ఇన్నర్ రింగ్ రోడ్డును స్వయంగా నిర్మాణం చేపట్టాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం బాధ్యతను మాత్రం కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలని యోచిస్తోంది.
నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, రాజధాని నిర్మాణానికి వినియోగించే ప్రతి రూపాయికి ఫలితం వుండాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణంలో భాగస్వాములయ్యే ప్రైవేట్ ఏజెన్సీలు మరింత ప్రతిభ కనబరచాల్సి వుందన్నారు. ఏజెన్సీలు పూర్తిస్థాయిలో పని చేయకుంటే ప్రభుత్వంపై ఆర్ధిక భారం తప్ప ఎటువంటి ప్రయోజనం వుండదని చెప్పారు.

రాజధాని పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఎటువంటి విధానం అనుసరించాలో మార్గదర్శకాలు రూపొందించాలని ఈ సందర్భంగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ బిల్డింగ్ రూల్స్-2016పై అధికారులు ముఖ్యమంత్రికి ప్రెజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో ఈ అంశంపై కొద్దిసేపు చర్చ జరిగింది. మరింత కసరత్తు చేసి రావాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

సమావేశంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, మునిసిపల్ కార్యదర్శి కరికాల వలవన్, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర, అదనపు కార్యదర్శి రాజమౌళి, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ కన్నబాబు, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్, రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read