ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గురువారం వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక అసెంబ్లీ, శాసన మండలి భవన నిర్మాణాలను పరిశీలించారు. శీతాకాల శాసనసభ సమావేశాలు డిసెంబరు నెలలో నిర్వహించాల్సి ఉన్నప్పటికీ నిర్మాణ పనులు జాప్యం కారణంగా సమావేశాలు నిర్వహించ లేదనే విషయాన్ని గుర్తించి పనులు వేగవంతం చేయాల్సి ఉన్నా మందకొడిగా సాగడం బాధాకరమన్నారు. ఈ నెలాఖరునాటికి నిర్మాణం పూర్తి కావాలని నిర్మాణ సంస్థ అధికారులు, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను స్పీకర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా స్పీకర్ డాక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, మూడో వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నట్లు సూచన ప్రాయంగా తెలిపారు. కొత్త శాసనసభ, శాసనమండలిని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్నాయన్నారు. విజయవాడలో ఫిబ్రవరి 10 నుండి మూడురోజుల పాటు జరగనున్న జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు. అలాగే ఈ సదస్సుకు వచ్చే ప్రతినిధులు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయాన్ని అసెంబ్లీ, శాసనమండలి భవనాలను సందర్శించే అవకాశం ఉండటంతో పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని స్పీకర్ సూచించారు.
అనంతరం నూతన అసెంబ్లీ శాసనమండలి భవనాలకు సంబంధించిన పూర్తి వివరాలు, వాహనాల పార్కింగ్, భద్రత ఏర్పాట్లు, స్పీకర్ ఛాంబర్, ముఖ్యమంత్రి, మంత్రివర్గ సహచరుల ఛాంబర్లు, ప్రతిపక్ష నేతకు కేటాయించే ఛాంబర్లకు సంబంధించిన వివరాలను స్పీకర్ డాక్టర్ కోడెల సంబంధిత శాఖ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రులు, ప్రతిపక్ష నేత, ఇతర సందర్శకుల గ్యాలరీలకు సంబంధించి స్పీకర్ స్వల్ప మార్పులను సూచించారు.