గౌతమిపుత్ర శాతకర్ణి - ఇది ఒక సినిమా మాత్రమే కాదు.. ఒక చరిత్ర... ఇది బాలకృష్ణ సినిమా కాదు, ఒక తెలుగు వీరుడి వీరోచిత గాథ... ఇది తెలుగుజాతి ఖ్యాతిని నేల నలుచెరుగులా విస్తరించి దేశం మీసం తిప్పిన ఒక అమ్మ కొడుకు చరిత్ర... వివిధ రాజ్యాల,ఘణాలుగా విడివడి ఒకరికొకరు కొట్టుకు చస్తున్న వారందరినీ ఓడించి ఒకే ఛత్రం కిందకి తీసుకువచ్చి అఖండ భారతావనిని సృష్టించిన ఒక తెలుగు వీరుని చరిత్ర... రాజసూయ యాగం నిర్వహించి.. ఒక కొత్త శఖానికి ఆద్యం పోసి ఉగాది అంటూ మనమందరం జరుపుకునే పండుగకి నాంది పలికిన ఒక తెలుగు సార్వభౌముడి చరిత్ర....నిజం ఇది సినిమా కాదు మన చరిత్ర... ప్రతి తెలుగువాడు చూసి తెలుసుకోవాల్సిన చరిత్ర... మన మూలాలు ఎంత బలమో.. మన నెత్తురుకి ఎంత సత్తువ వుందో మనకి తెలిపే చరిత్ర....
తెలుగు జాతి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహారాజులు, చక్రవర్తులు ఎంతో మంది ఉన్నారు. ప్రపంచంలో ఏ జాతికీ తీసిపోని ఖ్యాతి తెలుగువారి సొంతం. మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత.. మళ్లీ అంతటి అఖండ భూభాగాన్ని ఒకే ఏలుబడిలోకి తెచ్చిన పరాక్రమం శాతవాహనులది. ఆ వంశంలో 23వ చక్రవర్తి... భారతదేశచరిత్రలో నిలిచిపోయి వీరాధివీరుడు.. గౌతమీపుత్ర శాతకర్ణి. ఇప్పుడు ఆ శిఖరసమానుడి ఘనత వెండితెరపై నందమూరి బాలకృష్ణ 100వ చిత్రంగా, క్రిష్ అధ్బుతంగా మన చరిత్రను మన కళ్ళ ముందు ఉంచాడు.
శాతకర్ణి పాత్రలో బాలయ్య నటన అద్భతం.... నిజం గా శాతకర్ణి బాలయ్యకు పున్నాడేమో అన్నట్టు ఉంటుంది కొన్ని సన్నివేశాల్లో.. తరతరాలుగా తెలుగుజాతి మీద జరుతున్న ప్రతి కుట్రను ... ప్రతి అవమానాన్ని ... గౌరవ మర్యాదల కట్టుబాట్ల మద్య నిశ్శబ్దంగా భరిస్తూ , సహిస్తూ, ఎన్ని కుట్రలు పన్ని తొక్కాలని చూసినా ఎగిరొచ్చి, ఆకాశాన్ని తాకాలన్ని పొగరుగా ముందుకురికే తెలుగోడి కసితో రగిలిపోతున్న తెలుగోడి ఆత్మగౌరవ సమర శంఖారావం అయిన ఈ గౌతమిపుత్ర శాతకర్ణి పాత్రలో బాలకృష్ణ అద్భుతంగా నటించారు.
మాటాల రచయత బుర్రా సాయి మాధవ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే... ఆ మాటల్లో తెలుగువాడి పౌరుషం ఏంటో తెలుస్తుంది... ఒక డైలాగ్ ఇక్కడ ప్రస్తావించాలి... ఆ హీరో, ఈ హీరో అని... ఆ కులం, ఈ కులం అని.... ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అని కొట్టుకునే మన అందరం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది....
"వెళ్ళి ఈ ప్రపంచానికి నా మాటగా చెప్పు. నా దేశం ఉమ్మడి కుటుంబం, గది కి గది కి గోడలుంటాయ్ గొడవలుంటాయ్. ఈ ఇళ్ళు నాదంటే నాదని కొట్టుకుంటాం కానీ ఎవడో వచ్చి ఈ ఇళ్ళు నాదంటే ఎగరేసి నరుకుతాం.. సరిహద్దుల్లోనే మీకు స్మశానం నిర్మిస్తాం,మీ మొండేలా మీదే మా జెండా ఎగరేస్తాం...."
ముఖ్యంగా ఈ సినిమాలో, తెలుగుజాతి ఖ్యాతి, గౌరవం గురించి, ఉగాది ప్రాముఖ్యత గురించి, మరీ ముఖ్యంగా మన అమరావతి ప్రస్తావన వచ్చినప్పుడ్డు ప్రతి సారి, అణచుకోలేని భావోద్వేగం, నిక్కబొడుచుకున్న రోమాలు, ఇదా మన వీరోచిత గాథ అని ఉప్పొంగిపోయే భావన, గర్వంగా ఎగరేసిన తల వంటి అనుభూతులు కలగని ప్రేక్షకుడు ఉండడు.. బాలయ్య ను కళ్ళలోకి చూడాలంటే నే కొన్ని సందర్భాలలో భయం వేసింది ... నిజం గా శాతకర్ణి బాలయ్యకు పున్నాడేమో అన్నట్టు ..
చూసే ప్రతి కంటికీ కన్నుల పండుగ "గౌతమీ పుత్ర శాతకర్ణి ".. ప్రతి గుండెనీ మండే కాగడాలా మార్చేసిన "గౌతమీ పుత్ర శాతకర్ణి ".. పడమటి గాలి వెర్రిగా వీస్తున్న వేళ జాతి జవసత్వాలకి ప్రాణం పోసి నెత్తురు మరిగించిన పౌరుష జ్వాల "గౌతమీ పుత్ర శాతకర్ణి ".. ఖండాలుగా విడివడి ఉన్న అఖండ భారతావనిని ఏకం చేస్తూ యుద్ధాలకి ముగింపు పలికేందుకు యుద్ధానికి నాంది చెప్పి, తెలుగువాడి వాడి, వేడి చాటిన ఒక మహనీయుని చరిత్ర - మనమెరుగని చరిత్రని మనసుకి హత్తుకునేలా చూపి, తెలుగు చిత్రసీమ మకుటాన దర్శకుడు క్రిష్ పొదిగిన వజ్రం....
సమయం లేదు మిత్రమా... అమరావతి రాజధానిగా సమస్త భూమండలానికి నాడు గౌతమిపుత్రుడు పంపిన సందేశం మనకి స్ఫూర్తి కావాలి..ఆ స్పూర్తితో ప్రతి రంగంలోనూ తెలుగువాడు సత్తా చాటాలి..నేడు అదే అమరావతి నుండి మన నవ్యాంధ్ర ప్రయాణం మొదలైంది... ఇప్పుడు కుడా, సమస్త భూమండలానికి అదే సందేశాన్ని తిరిగి పంపుదాం.. జయహో అమరావతి.... జయహో శాతకర్ణి