తెలుగు సినిమా చరిత్రకు 85 వసంతాలు... తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’విడుదలై నేటికి 85 సంవత్సరాలు.. 1932 ఫిబ్రవరి 6న, భక్త ప్రహ్లాద విడుదల అయ్యింది. అందుకే, తెలుగు సినిమా పుట్టిన రోజుని, ఈ రోజుగా జరుపుకుంటారు. HM రెడ్డి గారు తొలిసారిగా "భక్త ప్రహ్లాద" సినిమాను నిర్మించారు. 5 - 2 - 1932 నాడు ఆ సినిమా విడుదల అయింది. మన ఈ తొలి పూర్తి తెలుగు సినిమా కేవలం 18 వేల రూపాయల పెట్టుబడితో, 18 రోజుల్లో నిర్మాణమైంది. మొత్తం 9,762 అడుగుల నిడివిగల 10 రీళ్ళ సినిమా ఇది. అప్పట్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో ఉన్న బొంబాయిలోనే, చిత్ర నిర్మాతల సొంత థియేటరైన కృష్ణా సినిమా థియేటర్‌లో ముందుగా ఈ చిత్రం విడుదలైంది. అక్కడ రెండు వారాలాడాక, తెలుగు నేల మీదకు వచ్చింది. విజయవాడ (శ్రీమారుతి సినిమా హాలు), రాజమండ్రి (శ్రీకృష్ణా సినిమాహాలు)ల్లో ప్రదర్శితమైంది.
ఆనాటి నుంచి నేటి వరకు సినిమా రంగం రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతూ ఇవాళ విశ్వవ్యాపితం అయింది. మొన్నమొన్నటి వరకు రాష్ట్ర సరిహద్దులు దాటని తెలుగు సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతూ అభిమానులను అలరిస్తుంది. ఎనభై అయిదేళ్ల సుదీర్ఘ కాలంలో వేలాదిమంది నటీనటులు, దర్శకులు, రచయితలు, సంగీత దర్శకులు, సాంకేతిక నిపుణులు, కార్మికులు తమ జీవితాలతో పాటు తెలుగు సినిమాకు కళాసేవ చేశారు.
బెజవాడ మారుతి థియేటర్లో తోలి సినిమా: ఇండియాలోనే తొలి టాకీ సినిమా ‘ఆలం ఆరా’ మారుతి థియేటర్లో ప్రదర్శించారు. ఈ సినిమాను ప్రదర్శించడానికి బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా ప్రొజెక్టర్లను తెప్పించారు. తరువాత తొలి తెలుగు టాకీ సినిమా "భక్త ప్రహ్లద" ఇదే ధియేటర్లో ఆడింది.
తెలుగు సినిమా విజయవంతంలో విజయవాడదే అగ్రస్తానం. ఇక్కడ సినిమా పరిశ్రమ వేళ్ళూనుకుంది. తెలుగు సినిమాకు 85 సంవత్సరాలు నిండితే, ఆంధ్రప్రదేశ్ లో, తోలి సినిమా హాలు మారుతి ధియేటర్ విజయవాడలో నిర్మించి, 95 ఏళ్ళు అయ్యింది.
విజయవాడలో ప్రఖ్యాత సినిమాహాళ్లు అప్పట్లో చాలానే ఉండేవి. 1921లో మారుతీ ధియేటర్, 1928లో దుర్గా కళా మందిరం, 1929 లక్ష్మీ టాకీస్, 1939లో రామాటాకీస్, 1940లో సరస్వతీ టాకీస్, 1944లో లీలామహల్ (ఆంద్రాలో ప్రత్యేకంగా ఇంగ్లీషు సినిమాలను ప్రదర్శించడానికి ఈ సినిమా హాల్ నిర్మించారు), 1948లో జైహింద్ టాకీస్, 1949లో జవహర్ థియేటర్ (విజయా టాకీస్), 1950లో శేష్ మహల్, 1951లో రాజస్తాన్ థియేటర్( వినోదా టాకీస్), 1952లో ఈశ్వర మహల్, ఆ తరువాత షహన్షా మహల్ (ఇప్పటి నవరంగ్ థియేటర్), శ్రీనివాస మహల్ ఇలా పలు థియేటరులు వచ్చాయి. ఇప్పుడు వీటిలో రెండు, మూడు మినహా అన్ని థియేటర్లు కనుమరుగు అయిపోయాయి. 1954లో ఆంద్రా ఫిలిం ఛాంబర్ వచ్చింది.
విశాఖపట్నంలో క్వాలిటీ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించిన కె.మంగరాజు, ఆ తర్వాత పేరు మార్చి విజయవాడలో పూర్గా పిక్చర్స్ను ఏర్పాటు చేసి ప్రథమ సినిమా పంపిణీదారుడుగా ప్రసిద్ధి పొందారు. అప్పట్లోనే 11 పంపిణీ సంస్థలు విజయవాడలో ఉండేవి. సినిమాలకు కావాల్సిన ప్రచారం కోసం అవసరమైన లిధో ప్రెస్సులు, పబ్లిసిటీ సంస్థలు, వంటివి చాలా వెలిసాయి. అప్పట్లో సినిమా, అనుబంధ పరిశ్రమల ద్వారా ఉపాధి బాగా ఉండేది.