ప్రముఖ జర్నలిస్ట్ మూర్తిని, గత కొన్ని రోజులుగా ఏపి సిఐడి టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. యూనివర్సిటీలలో జరిగిన నియామకాల్లో, ఎవరి సిఫారుసుతో పదవి వచ్చిందో చెప్తూ, టీవీ5లో కొన్ని ఫైల్స్ చూపించారు. అయితే ఆ ఫైల్ బయటకు ఎలా వచ్చిందో కనుక్కోవాలి అంటూ, ప్రభుత్వం కేసు పెట్టటంతో, సిఐడి రంగంలోకి దిగింది. ఆ షోలో, పాల్గున్న మాజీ జడ్జి శ్రవణ్ ఏ1 గా, మూర్తి ఏ2గా, టీవీ5 చైర్మెన్ ని ఏ3 గా చేర్చింది. అయితే ఈ సందర్భంలో, మూర్తికి బెయిల్ రావటం, ఇవన్నీ జరిగిపోయాయి. అయితే సిఐడి విచారణకు పిలవటంతో, నిన్న మూర్తి విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా, ఆయన జరిగిన పరిణామాల పై వీడియో రిలేజ్ చేసారు. గత కొన్ని రోజులుగా తాను సరిగ్గా షోకి రావటం లేదని, దీనికి కారణం ఏప్రిల్ 6 న జరిగిన ఒక షో విషయంలో, తమ పై సిఐడి కేసు పెట్టారని, ప్రెస్ ఫ్రీడమ్ ఉంది, తమ షో లో శ్రవణ్ వచ్చి, కొన్ని ఫైల్స్ చూపించి, చెప్పారు, ఆ ఫైల్ ఎలా వచ్చింది అనేది శ్రవణ్ ని అడగాలి, కాని ఇక్కడ మాత్రం, ఆ షో పెట్టానని నా పైన, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, ఎడిటోరియల్ బోర్డు ని కాకుండా, సంస్థ చైర్మెన్ పై కూడా కేసు పెట్టారని, మూర్తి అన్నారు. అయితే కోర్టుకు వెళ్లామని, బెయిల్ వచ్చిందని అన్నారు.
అయితే కోర్టు చెప్పినట్టు, సిఐడి ఆఫీస్ కు ఈ నెల 12 న వెళ్లామని, బాండ్ పేపర్స్, ఆధారాలు, ష్యురిటీ ఇచ్చి, వాళ్ళు అడిగిన స్టేట్మెంట్ ఇచ్చి వచ్చామని తెలిపారు. అయితే ఆ రోజు, 24న, 29న రావాల్సి ఉంటుందని, చెప్పారని, అయితే మొన్న 16 నైట్ హైదరాబాద్ వచ్చి, 17వ తేదీన మీరు రావాలని చెప్పటంతో, మళ్ళీ వచ్చానని, నిన్న ఉదయం 11 గంటలకు వెళ్తే, రాత్రి 9.30 గంటలకు పిలిచి, నా దగ్గర ఒక అరగంట స్టేట్మెంట్ తీసుకుని పంపించారని, మానసికంగా వేధించే విధంగా ప్రవర్తించారని, మాటిమాటికి పిలిచి, 10 గంటలు కూర్చోబెట్టి, వేధిస్తున్నారని అన్నారు. మళ్ళీ రేపు 19న రావాలని చెప్పినట్టు చెప్పారు. ఇలా మాటిమాటికి రమ్మని, ఏదో ఒక రోజు మాకు రావటం కుదరలేదు అని చెప్తే, బెయిల్ రద్దు చేసి, అరెస్ట్ చేసే కుట్ర చేస్తున్నారేమో అని అన్నారు. మేము ఏ తప్పు చెయ్యలేదు అని, అన్నారు. గత 25 ఏళ్ళుగా జర్నలిస్ట్ గా ఉన్నానని, ఏ తప్పు చెయ్యలేదని, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నన్ను మానసికంగా వేధిస్తున్నారని, ఇలా వేధించి గొంతు నొక్కాలి అనుకుంటే, ఇలా వేధిస్తే, అరెస్ట్ చేస్తే ఆగదని, నా ఊపిరి ఉన్నంత వరకు నా గొంతు వినిపిస్తుందని, అందుకే నా గొంతు ఆగాలి అంటే, నా ఊపిరి తీసేయండి అని అన్నారు.