వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు, మొదటి నుంచి, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పై, పార్టీకి సంబంధం లేకుండా, ఏ తప్పు జరిగినా, సొంత పార్టీ అయినా సరే ఎత్తి చూపిస్తూనే ఉన్నారు. మొదట్లో, వైసిపీ ప్రభుత్వం, తెలుగు మీడియం ఎత్తేసి, ఇంగ్లీష్ మీడియం తెచ్చిన సమయంలో, ఏకంగా పార్లమెంట్ లోనే, తెలుగు భాష పై మాట్లాడారు, అంతే కాదు మాతృభాషలో విద్యాబోధన అనేది చట్టం అని పార్లమెంట్ లోనే చెప్పి, తన పార్టీ తీసుకున్న నిర్ణయం తప్పు అనే విధంగా మాట్లాడారు. ఇక ఆ తరువాత, అనేక విషయాల పై, రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల పై, ప్రజల గొంతు వినిపించారు. ఇసుకలో జరుగుతున్న అక్రమాలు కాని, ఇళ్ళ స్థలాల పేరిట డబ్బులు వసూలు చెయ్యటం కాని, వరుసగా కోర్టుల్లో ఎదురు దెబ్బలు గురించి కాని, ఒకే సామజివర్గానికి పదవులు ఇవ్వటం కాని, ఇలా ప్రతి విషయంలో, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ తప్పు చేస్తుందో అవి మీడియాలో చెప్తూ వచ్చారు. తనకు జగన్ మోహన్ రెడ్డి అప్పాయింట్మెంట్ ఇవ్వటం లేదని, అందుకే నాలుగు గోడల మధ్య చెప్పాల్సింది, ఇలా మీడియా ద్వారా చెప్పాల్సి వస్తుందని అన్నారు. అయితే, అందరి పై ఎదురు తిరిగి నట్టే, రఘురామ కృష్ణం రాజు పై కూడా, ఎదురు తిరిగటం మొదలు పెట్టింది వైసిపీ పార్టీ. రఘురామ కృష్ణం రాజు సొంత సామజిక్వర్గ నేత చేత మొదట్లో తిట్టించారు.
తరువాత ఆ విషయం పై కూడా, మా చిన్న కులంలో చిచ్చు పెట్టకండి అని రఘురామ కృష్ణం రాజు బహిరంగంగా విమర్శించటంతో, మిగతా వారి చేత కూడా తిట్టించటం, దిష్టి బొమ్మలు తగల బెట్టించటం, ఇలా అనేక నిరసనలు చేసారు. ఇంతటితో ఆగకుండా, ఈ దిష్టి బొమ్మకు పట్టిన గతే నీకు పడుతుంది అని అన్నారని, రఘురామకృష్ణంరాజుకు వీడియోలు చేరటంతో, ఆయన సీరియస్ అయ్యారు. ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసారు. అక్కడ ఎవరూ పట్టించుకోలేదు, దీంతో జిల్లా ఎస్పీకి ఉత్తరం రాసారు. అయితే, మరో పక్క, తనకు రాష్ట్ర పోలీసులు పై నమ్మకం లేదు అంటూ, ఏకంగా ఢిల్లీలోనే చక్రం తిప్పటం మొదలు పెట్టారు. పార్లమెంట్ స్పీకర్ కు లేఖ రాసి, జరిగిన విషయం మొత్తం చెప్పి, వీడియో ఆధారాలు ఇచ్చి, తనకు కేంద్ర బలగాల చేత భద్రత కావాలని కోరారు. అయితే ఈ ఉత్తరం స్పీకర్, హోం మంత్రి అమిత్ షా కార్యాలయానికి పంపించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. తనకు తొందరలోనే కేంద్ర భద్రత వస్తుందని, అన్నారు. ప్రజాసమస్యలతో జగన్ బిజీగా ఉన్నారేమో, తనకు ఇప్పటికైనా కొంత సమయం ఇస్తే, ఆయనతో మాట్లాడతానని అన్నారు.