దివిసీమ ఉప్పెన. ఈ పేరు వింటేనే కృష్ణా జిల్లాలోని దివిసీమ వాసులు ఉలిక్కిపడతారు. తీరప్రాంతాన్ని ఆనుకుని ఉండే దివిసీమ సముద్రుడి ఉగ్రరూపాన్ని చూసిన రోజు అది. 1977 నవంబర్ 19 ఆ రోజు మధ్యాహ్నం సముద్రంలో చిన్న అలజడి ప్రారంభమైంది. సాయంత్రానికి అలజడి ఉదృతమైంది. ఆ తర్వాత ఆ ఉదృతి పెను ఉప్పెనగా మారింది. ఉప్పెన ఉగ్రరూపం దాల్చడంతో సముద్రుడు ఊళ్లకు ఊళ్లనే కబళించాడు.
అంతే తెల్లారెసరికి పదివేల మంది బ్రతుకులు తెల్లారిపోయాయి. దివిసీమ శవాల దిబ్బగా మారిపోయింది. ఎక్కడ చూసిన శవాలే, ఈ ఘటనలో నాలుగు లక్షల జంతువులు మృత్యువాతపడగా, మొత్తం 172కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. అంతటి విషాదాన్ని మిగిల్చిన ఆకాళరాత్రి గుర్తుకువస్తే దివిసీమ వాసులు ఇప్పటికి ఉలిక్కిపడతారు.
అసువులు బాసిన వారికి గుర్తుగా దివిసీమలో స్తూపాలు నిర్మించి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. నేటికి దివిసీమలో ఎవరిని కదల్చినా ఆ విషాదచాయల గురించి కళ్లకు కట్టినట్లు చెబుతున్నారు.
ఆ రోజు అసలేం జరిగింది ?
అంతకు ముందు రోజు రాత్రి నుండి తుఫాను హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. శనివారం నుంచి మూడు రోజులు స్కూళ్ళను మూసి వేస్తున్నట్లు కృష్ణా కలెక్టర్ అధికారికం గా ప్రకటించాడు. ఉదయం నుండి తీవ్రమైన నల్లటి మబ్బులు ఆకాశం అంతా కమ్ముకొని దాదాపు గంటకు వంద మైళ్ళ కంటే వేగం తో గాలులు మొదలైనాయి. రాత్రి పది దాటిన తర్వాత తుఫాను భీభత్సం పెరిగింది. మిన్నూ మన్నూ ఎకమ య్యేట్లు భీబత్సంగా వర్షం కురిసింది. అర్ధరాత్రి పూట కట్టలు తెంచుకున్న ప్రవాహం గ్రామాలపై విరుచుకుపడింది.
చిమ్మ చీకట్లో ఉధృతంగా విరుచుకుపడ్డ వరదలో అనేకమంది కొట్టుకుపోతూ.. తుమ్మ ముళ్ల కంపలకు చిక్కుకుని వేలాదిమంది ప్రాణాలు వదిలారు. పశుపక్ష్యాదులు సైతం మృత్యువాతపడ్డాయి. 200 కిలోమీటర్ల వేగంతో వీసిన ప్రచండ గాలులకు భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విల్లుల్లా వంగిపోయాయి. గ్రామం మొత్తాన్ని శ్మశానంగా మార్చింది. శవాల గుట్టల మధ్య తమవారి ఆనవాళ్లను వెతికేందుకు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. దాదాపు 14,204 మంది చనిపోయారు.
కోడూరు మండలంలోని పాలకాయతిప్ప, హంసలదీవి, ఇరాలి, ఊటగుండం, గొల్లపాలెం, బసవవానిపాలెం, ఉల్లిపాలెం..నాగాయలంక మండలంలోని ఏటిమోగ, సొర్లగొంది, ఎదురుమొండి, సంగమేశ్వరం, నాచుగుంట, ఏలిచట్ల దిబ్బ తదితర మత్స్యకార గ్రామాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కృష్ణాతోపాటు గుంటూరు జిల్లాలోనూ ఈ ఉప్పెన ప్రభావం కనిపించింది. రేపల్లె, నిజాంపట్నం తదితర గ్రామాలు ప్రళయం దాటికి దెబ్బతిన్నాయి.