తెరచాప రెపరెపలు... అలలపై వీచే చల్లని గాలులు... వీటి మధ్య విదేశీ అతిధి పక్షుల ఐకమత్యం.. ఒంటికాలు పై జపం... గూళ్ళుకట్టి పొదిగే ఆడ పక్షులు.. పిల్లలకు ఆహారాన్ని పెడుతూ వాటికి రక్షణగా నిలిచే మగ పక్షులు... ఈ మనోహర దృశ్యాలకు వీదికయ్యాయి పులికాట్, నెలపట్టు ప్రాంతాలు... వీటిని వీక్షించేందుకు వీలుగా యంత్రాంగం నెల్లూరు జిల్లా, సూళ్ళురిపేట వేదికగా పక్షుల పండుగ, ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తుంది.
నేలపట్టులో పక్షుల ఆవాసానికి అనుకూలం
నెల్లూరు నుంచి 80 కిలోమీటర్ల దూరంలో నేలపట్టు ప్రాంతం ఉంది. చలి కాలం వచ్చిదంటే చాలు.. అక్కడ అందమైన సందడి మొదలవుతుంది.. విదేశాల నుంచి ఎన్నో పక్షులు వచ్చేస్తాయి. సముద్రపు రామచిలుక, పెలికాన్, పెయింటెడ్ స్టార్క్, ఓపెన్ బిల్ స్టార్క్, తెల్ల కంకణాయి, నీటికాకిలాంటి పక్షులు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేస్తాయి.. ప్రతి ఏడాది అక్టోబర్ నుంచి ఏప్రిల్‌వరకూ ఇక్కడే ఉంటాయి. సైబీరియా, ఆస్ట్రేలియా, గుజరాత్‌లోని రాణ్ ఆఫ్ కంచ్ నుంచి ఈ పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి చేరుకుంటాయి. నేలపట్టులో ఈ పక్షుల ఆవాసానికి అనుకూల పరిస్థితులున్నాయి.. చుట్టూ నీరు, మధ్యలోఉన్న చెట్లపై గూడు కట్టుకుంటాయి... అనంతరం గుడ్లను పొదుగుతాయి. సంతాన ఉత్పత్తి తర్వాత నేలపట్టు సమీపంలోని పులికాట్ సరస్సులో ఆహారాన్ని సేకరించి పిల్లలకు అందజేస్తాయి. 5 నెలల పాటు ఈ ఫ్లెమింగో, ఇతర జాతి పక్షులు నేలపట్టులో సందడి చేస్తూనేవుంటాయి. పిల్లలు ఎగిరే స్థాయికి చేరుకున్న తర్వాత అవి తమ స్వదేశాలకు తరలి వెళ్తుంటాయి...ఎన్నోఏళ్లుగా ఈ పక్రియ కొనసాగుతోంది.
పక్షులు, పర్యాటకులతో కళకళలాడుతున్న నేలపట్టు, పులికాట్ సరస్సులు
అక్టోబర్ వచ్చిందంటే చాలు ఈ ప్రాంతం పక్షులేకాదు... వాటిని చూసేందుకువచ్చే పర్యాటకులతో కళకళలాడిపోతుంది.. పచ్చని చెట్లమధ్య రంగు రంగుల రెక్కలతో ఆకట్టుకునే ఈ పక్షుల్ని చూసేందుకు చాలామంది ఇక్కడికి వస్తారు... వీరిసంఖ్యను మరింత పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది పర్యాటకశాఖ.. అటవీ, టూరిజం శాఖలు కలిసి ఈ ప్రదేశాన్ని విహారకేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇప్పటికే కొన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.. దీంతో సెలవురోజుల్లో దాదాపు 2వేలమందికిపైగా పర్యాటకులు ఇక్కడివచ్చి పక్షుల్ని చూస్తున్నారు.
పక్షుల వచ్చే సమయాన్ని లక్కీ పీరియడ్‌గా భావిస్తున్న స్థానికులు
ఈ పక్షుల వచ్చే సమయాన్ని స్థానికులు లక్కీ పీరియడ్‌గా భావిస్తారు.. ఈ విహంగాల్ని దేవతాపక్షులుగా ఆరాధిస్తారు.. ఇవి వచ్చాకే వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు.. ఇక పక్షులు ఏదో ఆశామాషీగా ఇక్కడికి రావు... పరిస్థితులు అన్నీ సక్రమంగా ఉన్నాయని ధృవీకరించుకున్నాకే ప్రయాణం ప్రారంభిస్తాయి.. ముందు కొన్ని పైలట్ పక్షులు నేలపట్టుకువచ్చి అన్నీ పరిశీలిస్తాయి.. ఆ తర్వాత మిగతా పక్షుల్ని తెస్తాయి.. దాదాపు 250 ఎకరాల విస్తీర్ణంలో నేలపట్టు చెరువు ఉంటుంది.. ఈ ప్రాంతం ఆసియాలోనే పక్షుల సంతానోత్పత్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.
రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వం
1972 నుంచి వివిధ దేశాల నుంచి వేల సంఖ్యలో వచ్చే పక్షులను సంరక్షించడంతో పాటు పులికాట్, నేలపట్టు ప్రాంతాలను పర్యాటక కేంద్రాలు మార్చడానికి 2001లో పక్షుల పండుగను ప్రారంభించింది. పులికాట్ సరస్సుకు వచ్చే అరుదైన పక్షిగా చెప్పుకునే ఫ్లేమింగో పక్షి పేరుతో ప్రభుత్వం ప్రతి ఏటా పండుగలను అట్టహాసంగా నిర్వహిస్తూ వస్తోంది. త ఏడాది నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్‌ను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది.