ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది రోజుల్లో వెల్లడి కానున్నాయి. ఒక్కమాటలో సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే 2వారాల రెండు రోజుల్లో ఏపీలో అధికార పీఠం ఏ పార్టీదనే విషయం తేలిపోనుంది. అయితే.. వైసీపీలో కొందరి భవితవ్యంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అలాంటి వారిలో నగరి వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా ముందువరుసలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆమె పోటీ చేసినప్పటి పరిస్థితులు వేరు, ఈ ఎన్నికల్లో ఆమె పోటీ చేసిన సమయానికి ఉన్న పరిస్థితులు వేరు. 2014 ఎన్నికల్లో నగరి నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రోజా టీడీపీ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమ నాయుడిపై 858 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. గెలిచిన విషయం తెలుసుకున్న ఆమె కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
కానీ.. 2019 ఎన్నికల్లో పోటీ చేసే నాటికి ఆమెపై వచ్చిన విమర్శలు అన్నీఇన్నీ కావు. నియోజకవర్గ సమస్యలను గాలికొదిలేసి కామెడీ షోలో కాలక్షేపం చేశారని రోజాపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు, వ్యవహార శైలి, హావభావాలతో ఆమె అభాసుపాలయ్యారు. అయితే.. ఎన్ని విమర్శలొచ్చినా పార్టీపరంగా జగన్ రోజాకు ప్రాధాన్యం ఇవ్వడంతో వైసీపీ అధికారంలోకి వచ్చి, నగరి ఎమ్మెల్యేగా ఆమె గెలుపొందితే మంత్రి పదవి ఖాయమని వైసీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. అయితే.. నగరిలో రోజా గెలుపు అంత సునాయాసం కాదనే ప్రచారం జరుగుతోంది. 2014 నాటి పరిస్థితులు ప్రస్తుతం లేవని, అప్పట్లో రెండు సార్లు ఓడిపోయారన్న సానుభూతి కూడా రోజాకు కలిసి రావడంతో గత ఎన్నికల్లో ఆమె స్వల్ప ఆధిక్యంతో గెలిచారనేది టీడీపీ వాదన.
నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ఎమ్మెల్యేగా రోజా విఫలమయ్యారని.. టీడీపీ అభ్యర్థి భానుప్రకాష్ గెలుపు ఖాయమని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. అదే జరిగి.. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చి, రోజా ఓడిపోతే ఆమె రాజకీయ భవిష్యత్ ఏంటనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇక గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని, చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజకీయ భవితవ్యంపై ఇదే తరహా ప్రచారం జరుగుతోంది. ఈ అభ్యర్థులకు పార్టీ గెలిస్తే మంత్రి పదవి ఖాయమని కరాఖండిగా చెబుతున్న వైసీపీ శ్రేణులు పార్టీ ఓడి, ఈ అభ్యర్థులు కూడా ఓడితే పరిస్థితి ఏంటనే ప్రశ్నకు మాత్రం సూటిగా సమాధానం చెప్పలేక నీళ్లునములుతున్నారు.