తెలుగుదేశం పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలను ఏదో ఒక విధంగా లోపల వెయ్యటానికి, వైసిపీ ప్రభుత్వం, అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. తాజగా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను టార్గెట్ చేస్తూ, కధ నడుస్తుంది. మొన్నటి వరకు, కోడెల పై వరుస కేసులు పెట్టించి, ఎలా ఇబ్బంది పెట్టారో, ఇప్పుడు చింతమనేని పై అలా టార్గెట్ సెట్ చేసారు. అధికారంలో ఉండగా, చింతమనేని దూకుడుతో, కొంత చెడ్డ పేరు తెచ్చుకున్నారు. కాని అయన నియోజకవర్గ ప్రజలు మాత్రం, ఆయన దూకుడు ఎప్పుడూ ప్రజల కోసమే అని, ఆయన స్వార్ధానికి ఎప్పుడూ వాడుకోలేదని, ఆయనకు మద్దతు పలికేవారు. అయితే, ఇప్పుడు ఆయన ఓడిపోయారు, పార్టీ కూడా అధికారం కోల్పోయింది. మొన్నటి వరకు జిల్లా అంతటా ఆధిపత్యం చెలాయించిన చింతమనేని, నిప్పుడు వైసిపీ టార్గెట్ చేసింది. గత మూడు నెలలుగా చింతమనేని పై స్కెచ్ వెయ్యగా, ఇన్నాళ్ళకు ఆయన పై కేసు పెట్టె ఒక ఆధారం దొరికింది.
ఇసుక ఇబ్బందుల కోసం, ఆగష్టు 30న అన్ని కలెక్టరేట్ వద్ద ధర్నాకు తెలుగుదేశం పార్టీ పిలుపు ఇచ్చింది. ఇందులో భగంగా చింతమనేని కూడా ధర్నాకు సిద్ధం అయ్యారు. దీంతో పోలీసులు దుగ్గిరాలలోని చింతమనేని నివాసంలోనే ఆయన్ను హౌస్ అరెస్ట్ చేసారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చింతమనేనిని బయటకు వెళ్ళనివ్వకుండా చూసారు. ఎప్పటికప్పుడు పై అధికారుల ఆదేశాలు అనుసరిస్తూ, చింతమనేనిని నిలువరించారు. అయితే, మరో రెండు రోజుల తరువాత, మళ్ళీ చింతమనేనిని టార్గెట్ చేసారు. పెదవేగి స్టేషన్‌లో చింతమనేని పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. దీంతో ఆయన, లక్ష్యంగా చేసుకుని పోలీసులు ఎక్కడికక్కడ వెతుకుతూ, ఏలూరు నగర కూడళ్ళలోను, కోర్టు వద్ద, దుగ్గిరాల సమీపంలోనూ పెద్దఎత్తున మొహరించారు.
అయితే చింతమనేని అదృశ్యం అవ్వటంతో, పోలీసులు ఖంగుతిన్నారు. తేరుకుని చింతమనేని ఎక్కడకు వెళ్ళిపోయారో తీవ్ర స్థాయిలో ఆరా తీశారు. ఎంత వెతికినా అయన ఆచూకీ మాత్రం తెలవలేదు. ఇదే క్రమంలో, రాజకీయ నేతల అండదండలతో, మరికొంత మంది వచ్చి చింతమనేని పై కేసులు పెట్టారు. దీంతో చింతమనేనిని ఎలా అయినా పట్టుకోవాలి అంటూ, పోలీసు వర్గాలపై ఒత్తిడి పెంచారు. ప్రభాకర్ ని అరెస్టు చేయడానికి పోలీసులుసరిగ్గా వ్యవహరించలేదని, ఏలూరు రూరల్ సీఐ మూర్తిపై డీఐజీ ఏఎస్ ఖాన్ గురువారం సస్పెన్షన్ వేటు విధించారు. రాజకీయ ఒత్తిళ్ళకు, సిఐ బలయ్యారు. అయితే జరుగుతున్న పరిణామాల పై, పోలీసు ఉన్నతాధికారులను కలిసేందుకు మాజీ మంత్రి పితాని సత్యనారాయణతో సహా పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, మరికొందరి నేతలు ప్రయత్నించగా, పోలీసులు ఎవరూ వాళ్ళని కలవటానికి ఇష్ట పడలేదు. దీంతో, టిడిపి నేతలు పోలీసుల ఏకపక్ష వైఖరిని తప్పు బట్టారు.