అమరావతిలో 18 రోజులుగా రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. రాజధానిని ఇక్కడ నుంచి తరలించవద్దు అంటూ, ఆందోళన చేస్తున్న రైతులు, నిన్నటి నుంచి సకల జనుల సమ్మెకు పిలుపిచ్చిన సంగతి తెలిసిందే. నిన్న మందడం గ్రామంలో, మహిళలు రోడ్డుకు అడ్డంగా వచ్చారనే నెపంతో, పోలీసులు, అక్కడ ఉన్న మహిళా రైతులను అరెస్ట్ చేసి, బస్సు ఎక్కించే సందర్భంలో, మహిళల పై పోలీసులు ప్రవర్తించిన తీరుతో, ప్రభుత్వం విమర్శల పాలు అయ్యింది. ప్రశాంతంగా నిరసనలు తెలియచేస్తున్నా, పోలీసులు తమను అరెస్ట్ చెయ్యటం పై, రైతులు ఆవేదన వ్యక్తం చేసారు. నిన్న పోలీసుల పై, తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో, మహిళలు కంప్లైంట్ కూడా ఇచ్చారు. అయితే ఈ రోజు కూడా మందడం లో ఉదయం నుంచి బంద్ వాతావరణం కొనసాగింది. మహిళలపై దౌర్జన్యానికి నిరసనగా ఉదయమే రహదారిపైకి వచ్చిన రైతులు నిరసనలు చేపట్టారు. అయితే నిన్న తమ పై పోలీసులు చేసిన దౌర్జన్యానికి నిరసనగా, ఈ రోజు పోలీసులకు గ్రామస్థుల సహాయ నిరాకరణ చేపట్టారు.
తమ గ్రామంలో మంచినీళ్లు సహా పోలీసులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించరాదని నిర్ణయం తీసుకున్నారు. తమ దుకాణాల ముందు కూర్చొటానికి కూడా వీల్లేదని రైతులు స్పష్టం చేసారు. పోలీసు వాహనాలను అడ్డుకుని తమ గ్రామం మీదుగా వెళ్ళటానికి వీల్లేదని రైతులు వెనక్కి పంపించారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు కూడా రైతులు కాళ్ళ మీద పడి, తమ పనిని తాము చేసుకోనివ్వాలని కోరారు. దుకాణాలు తెరవనీయకుండా సంపూర్ణ బంద్ ను రైతులు పాటిస్తున్నారు. రహదారి మొత్తం పరదా పరిచి రాకపోకలను పూర్తిగా స్థంభింపచేసారు రైతులు. మీరు మాకు సహకరించాలంటే..., మీరు మాకు సహకరించాలంటూ పరస్పరం రైతులు, పోలీసులు కాళ్ళు పట్టుకునే పరిస్థతి వచ్చింది.
ఇది ఇలా ఉంటే, వెలగపూడి గ్రామంలో గత రాత్రి పోలీసుల హల్చల్ చేసారు. 4 జీపుల్లో వచ్చి మమ్మల్ని భయబ్రాంతులకు గురిచేశారని రైతులు వాపోయారు. అర్ధరాత్రి తలుపులు కొట్టి మహిళల్ని భయపెట్టారని, ఇళ్లంతా బూటు కాళ్లతో తొక్కి నానా రచ్ఛా చేశారని రైతులు వాపోయారు. ఒక గ్రామస్థుడ్ని పోలీసులు ఎక్కడికో తీసుకెళ్లారని రైతులు వాపోయారు. ఇంతవరకు అతని ఆచూకీ తెలియటం లేదని రైతులు అన్నారు. పోలీసుల అరాచకాలపై ఫోటోలు, వీడియోలు చూపి కన్నీళ్ల పర్యంతమైయ్యారు రైతులు. మరో పక్క భారీ ర్యాలీ చేపట్టి సీడ్ యాక్సిస్ రహదారిపై బైఠాయించారు మందడం రైతులు. అటు మందడం వైపు, ఇటు సీడ్ యాక్సిస్ వైపు 2రహదారులు దిగ్బంధించారు రైతులు. భారీగా పోలీసులు మోహరించటంతో, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.