ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రశాంతంగా సాగుతున్న జీవితాల్లో, ఉన్నట్టు ఉండి అనిశ్చితి నెలకొంది. విభజనకు ముందు ఉన్న, సమ్మెలు, ధర్నాలు, బంద్ లు, అరెస్ట్ లు, ఇప్పుడు మళ్ళీ ప్రతి రోజు చూస్తున్నాం. 2014 ముందు వరకు, ఇలా సాగిన జీవితాలు, మన బ్రతుకు మనం బ్రతుకుతూ, సొంత రాష్ట్రంలో ప్రశాంతంగా బ్రతుకు సాగిస్తున్నాం. అయితే 2019లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం, ముందు నుంచి అమరావతి పై ఉన్న అనాసక్తిని, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చూపిస్తున్నారు. 18 రోజుల క్రితం అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ రాజధానికి మూడు రాజధానులు ఉంటే తప్పు ఏమిటి అంటూ, చెప్పుకొచ్చారు. అమరావతిలో కేవలం అసెంబ్లీ ఉంటుందని, పరిపాలన మొత్తం విశాఖ నుంచి చేస్తామని, హైకోర్ట్ కర్నూల్ లో పెడతామని చెప్పారు. దీంతో అమరావతి కోసం, 33 వేల ఎకరాలు భూములు ఇచ్చిన రైతులు రోడ్డున పడ్డారు. దీనికి తోడు, జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ కూడా, మూడు రాజధానులకు అనుకూలంగా తమ రిపోర్ట్ ఇచ్చారు.
అయితే గత 18 రోజులుగా, రైతులతో పాటు అన్ని వర్గాల వారు, వారికి సపోర్ట్ గా ఆందోళన చేస్తున్నారు. వివిధ రాజాకీయ పార్టీలు కూడా వారికి సపోర్ట్ గా ఆందోళన చేస్తున్నాయి. అయితే అందరి చూపు బీజేపీ వైపు ఉంది. కేంద్రంలో ఉన్న బీజేపీ తలుచుకుంటే, ఈ ప్రక్రియ ఆగిపోతుందని అందరి అభిప్రాయం. అయితే కేంద్రం మాత్రం ఇంత వరకు స్పందించలేదు. ఇక్కడ ఏపిలో బీజేపీ నేతలు తలా ఒక మాట చెప్తున్నారు. కన్నా, సుజనా, సహా వివిధ నేతలు అమరావతికి అనుకూలంగా మాట్లాడుతుంటే, జీవీఎల్ వచ్చి నా మాట బీజేపీ అధికారిక మాట అంటూ, అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ తరుణంలో, కేంద్ర హెం శాఖ సహాయ మంత్రి, కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆసక్తిగా మారాయి. అమిత్ షా కింద, సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి స్పందించటంతో, ఇదేనా కేంద్రం వైఖరి అనే అభిప్రాయం కలుగుతుంది.
నిన్న కిషన్ రెడ్డి, హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, మూడు రాజధానుల పై స్పందించారు. రాజధాని ఎంపిక అనేది, రాష్ట్రం అంశం అయినప్పటికీ, మూడు రాజధానులు కరెక్ట్ కాదని అన్నారు. రాజధానిగా రాష్ట్రం ఏదైనా ఎంపిక చేసుకోవచ్చని, కాని తమ నిర్ణయాన్ని కేంద్రానికి చెప్పిన తరువాత, దాని పై కేంద్రం తమ వైఖరిని చెప్తుందని కిషన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా చెప్పలేదని, చెప్పిన తరువాత, కేంద్రం దీని పై స్పందిస్తుందని అన్నారు. అలాగే ఏపి బీజేపీలో నేతలు చేస్తున్న భిన్న ప్రకటనలు సరి కవాని కిషన్ రెడ్డి అన్నారు. ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అన్నారు. ఏపీ రాజధాని అమరావతిని భారత చిత్ర పటంలో తానే పెట్టించినట్లు గుర్తుచేశారు. అలాగే రాజధాని రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.