ఈ రోజు చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. అన్ని ప్రాంతీయ పార్టీలను, జాతీయ పార్టీలను కలిపి, బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చెయ్యటానికి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఆయనే చొరవ తీసుకుని రంగంలోకి దిగారు. ముందుగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్, శరద్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లాని కలిసి, తరువాత, బీఎస్పీ అధినేత్రి మాయావతిని సీఎం చంద్రబాబు కలిశారు. ఈ భేటీలో దేశం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. అయితే భేటీ అయిన తరువాత చంద్రబాబును మాయావతి ప్రత్యేకంగా ఆశీర్వదించండం విశేషం. సమావేశనంతరం కారుదాకా వచ్చి చంద్రబాబును మాయావతి సాగనంపారు.
మాయవతి స్వభావం తెలిసిన వారు, ఇది చూసి ఆశ్చర్యపోతున్నారు. సహజంగా మాయావతి, అంత గౌరవం ఎవరికీ ఇవ్వరని, చంద్రబాబును ఆమె ఎంతో గౌరవంగా చూసారని అంటున్నారు. భవిష్యత్‌లో కలిసి పనిచేద్దామని చంద్రబాబుతో మాయావతి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలు బలపడాల్సిన అవసరం ఉందని, ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో అధికారంలోకి వస్తే నియంతృత్వ పోకడలు ఉండవని ఆమె స్పష్టం చేసింది. కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని, ఎన్నికలు జరగుతున్న 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో ఏర్పడిన విభేదాల పై చంద్రబాబుతో మాయావతి చర్చించినట్లు సమాచారం.
అంతకుముందు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లాను చంద్రబాబు కలిశారు. దేశాన్ని ఎలా రక్షించుకోవాలన్న అంశంపై చర్చించుకున్నామని ఫరూక్ తెలిపారు. దేశం ముఖ్యం, దేశ భిన్నత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యమని, అందుకోసమే తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు. అన్ని పక్షాలను కలుపుకుపోతామని ఐక్యత సాధిస్తామని స్పష్టం చేశారు. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదని, గెలిచాక నిర్ణయించుకోవచ్చని ఆయన చెప్పారు. కూటమి నేతనని, ప్రధాని అభ్యర్థినని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పుకోలేదని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు.