ఎన్నికల ఫలితాలు తరువాత, ఓటిమి పొందిన తరువాత, తెలుగుదేశం పార్టీ నేతలను బీజేపీ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో వీక్ గా ఉందని, ఆ పార్టీని తోక్కేస్తే, తామే ప్రతిపక్షంగా వ్యవహరించవచ్చని బీజేపీ అనుకుంటుంది. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్ళిన సమయంలో, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలను అందరినీ చేర్చుకునే ప్లాన్ వేసింది. బీజేపీ నేతలు కూడా, చంద్రబాబు విదేశాల నుంచి తిరిగి వచ్చే సరికి, తెలుగుదేశం పార్టీ మిగలదు అని, అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నాయకులూ అందరూ మా పార్టీలో చేరిపోతారని హడావిడి చేసారు. దీనికి తగ్గట్టే ముందుగా ఒకే రోజు, నలుగురు రాజ్యసభ సభ్యులను చేర్చుకుని, సంచలనం సృష్టించారు.
ఈ ఫ్లో చూసిన వాళ్ళు, నిజంగానే బీజేపీ అన్నంత పని చేస్తుందేమో అని అనుకున్నారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆ నలుగురు రాజ్యసభ సభ్యులను తప్ప, పెద్ద నేతలను ఎవరినీ లాగలేక పోయింది. చిన్న చిన్న నాయకులు మినహా పెద్దగా ఎవరూ వెళ్ళలేదు. తాజగా రాయపాటి, తాను బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. దీంతో మళ్ళీ తెలుగుదేశం పార్టీ నేతలు, బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు అంటూ, మళ్ళీ వార్తలు మొదలయ్యాయి. ఈ నేపద్యంలో, ఇప్పటి వరకు ఈ వలసల పై మాట్లాడని చంద్రబాబు, ఈ విషయం పై తనను కలసిన నేతలతో ప్రస్తావించారు. నిన్న చంద్రబాబు నివాసంలో, తెలుగుదేశం పార్టీ ఎంపీలు చంద్రబాబుని కలిసి, పార్లమెంట్ జరుగుతున్న తీరు గురించి వివరించారు.
ఈ నేపధ్యంలో, బీజేపీలోకి వలసల పై, ఎంపీలు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. దీని పై స్పందించిన చంద్రబాబు, మన పార్టీ నుంచి వెళ్ళిపోయే వారిని పోనివ్వండి, మనం ఆపితే ఆగరు కదా, వారు పొతే కొత్త నాయకత్వం తాయారు అవుతుంది, కొత్తవారితో పార్టీని బలోపేతం చేద్దాం అని చంద్రబాబు అన్నారు. అంతే కాదు, ఇలాంటి నేతలు ఎంత మంది వెళ్లి బీజేపీలో చేరినా, వారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరిస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడుల్లోనూ బీజేపీ ఎన్ని విన్యాసాలు చేసినా వారు ఎదిగే అవకాసం లేదని అన్నారు. ఎవరు ఏమి చేసినా, మనం మన పని చేసుకుంటూ వెళ్దాం, ప్రజా సమస్యల పై ఎప్పటికప్పుడు పోరాడుతూ ఉందాం, ప్రజలకు దగ్గరగా పని చేద్దాం అని దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు చెప్పిన అభిప్రాయాన్నే టిడిపి అభిమానులు కూడా చెప్తున్నారు. ఇలాంటి నేతలు పోయినా, ఒక్క కార్యకర్త కూడా అటు వైపు చూడరని, ఒక్కరు కూడా బీజేపీకి ఓటు వెయ్యరని అంటున్నారు. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ, రాష్ట్రంలో దాని స్థానం ఏంటో ప్రజలు చెప్పారని అంటున్నారు.