ముఖ్యమంత్రి విన్నపం, విజయవాడ ఎంపీ కేశినేని నాని నిత్య సంప్రదింపులు ఫలించాయి. కృష్ణానదిపై నిర్మంచ తలపెట్టిన, ఐకానిక్ బ్రిడ్జి ముందు అనుకున్నట్టు నాలుగులైన్ల కాకుండా, ఆరులేన్ల ఐకానిక్ బ్రిడ్జికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మంగళవారం జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ నేపద్యం:
విజయవాడ నుండి గుండుగొలను ఔటర్ రింగ్ నిర్మాణంలో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని పెదఅవుటపల్లి నుంచి గుంటుపల్లి వరకు నాలుగులేన్ల బైపాస్ నిర్మాణాన్ని, అక్కడి నుంచి కృష్ణానది మీదుగా నాలుగులేన్ల బ్రిడ్జి నిర్మించడానికి గామన్ ఇండియా బీఓటీ విధానంలో, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టు దక్కించుకుంది. అయితే, అప్పటినుంచి, వివిధ కారణాల చేత గామన్ ఇండియా పనులు మొదలుపెట్టలేదు.
అయితే, తాజా పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగటం, ఇక్కడే అమరావతిని రాజధానిని చెయ్యటం నిర్ణయించుకున్న తరువాత, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు లైన్ల్ల స్థానంలో ఆరు లేన్లుగా అభివృద్ధి చేయాలని, కేంద్రాన్ని కోరుతున్నారు. ఈ ప్రతిపాదాన్ని ఆమోదించుకోవటానికి, విజయవాడ ఎంపీ కేశినేని నాని, కేంద్ర మంత్రి గడ్కరీతో నిత్య సంప్రదింపులు చేస్తున్నారు. దీనిపై మంగళవారం ఢిల్లీలో నితిన్ గడ్కరీ కార్యాలయంలో ఎన్హెచ్ఏఐ చైర్మన్ మల్లిక్, ఎంపీ కేశినేని నాని సమావేశమయ్యారు. అనంతరం కేంద్రమంత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకరించింది. ఇందుకు అవసరమైన అంచనాలను వెంటనే రూపొందించాలని ఎన్‌హెచ్ అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి.
అమరావతి రాజధానిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మిస్తూ, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని, నాలుగు లేన్ల బైపాస్ రోడ్డుని, ఆరు లైన్లు చెయ్యటం, అలాగే కృష్ణా నది మీద బ్రిడ్జి కూడా ఆరు లైన్లు చేయటంలో సఫలం అయ్యారు. విజయవాడ బైపాస్‌ను రెండువైపులా సర్వీసు రోడ్లు, అండర్‌పాస్‌లతో సహా ఆరులేన్లు, కృష్ణానదిపై ఆరులేన్ల వంతెనతో, అమరావతి - విజయవాడ కు మంచి కనెక్టివిటీ వస్తుంది. నాలుగు లేన్ల రోడ్డు కోసం, ఇదివరకే భుసమీకరణ పూర్తియ్యింది. ఆరులేన్ల రోడ్డుకి, సర్వీస్ రోడ్డుకి ఈ భూమి సరిపోతుంది అని అధికారులు చెప్పారు. భుసమీకరణతో ఇబ్బంది లేదు కాబట్టి, కేంద్రం ప్రాజెక్ట్ అంచనా ఆమోదించిన వెంటనే, ఈ ప్రాజెక్ట్ మొదలవుతుంది.