రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్‌కు పుష్కల అవకాశాలున్నాయని, సోమవారం ముఖ్యమంత్రి సమక్షంలో వంద కంపెనీలపెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరగనున్నాయని ఫుడ్ ప్రాసెసింగ్ అధికారులు చెప్పారు. ఆక్వా, పండ్లు, కూరగాయలు, డెయిరీ, పౌల్ట్రీ పరిశ్రమల ఏర్పాటుకు పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని చెప్పారు.
ఈ 100 కంపెనీల్లో, నాలుగైదు సంస్థలు రూ.40 కోట్ల చొప్పున, 30 సంస్థలు రూ.10 కోట్ల చొప్పున, మిగతావి చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ వంద కంపెనీలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టమాటా ప్రాసెసింగ్, కొబ్బరి ఉత్పత్తుల తయారీ వంటి యూనిట్లలో పెట్టుబడులు పెట్టనున్నాయి.
పారిశ్రామికవేత్తలకు అవసరమైన పరిజ్ఞానం, నిర్వహణ పరిజ్ఞానం అందించేందుకు జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పెసైస్ రీసెర్చ్, కోకోనట్ డెవల్‌పమెంట్ బోర్డు, మేనేజ్ వంటి 23 సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞాన భాగస్వాములుగా ఎంపిక చేసింది. ఈ సంస్థలతో కూడా సోమవారం ఇందుకోసం ఒప్పందాలు జరగనున్నాయి.