ఓట్ల పండగకు సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకున్న ప్రజలకు ప్రైవేటు ట్రావెల్స్ ఊహించని షాకిచ్చింది. పోలింగ్‌కు ఒక్కరోజు మాత్రమే మిగిలివున్న దశలో 10వ తేదీన వెళ్లాల్సిన 125 సర్వీసులను ట్రావెల్స్ రద్దు చేసింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోగా రిజర్వ్ చేసుకున్న వారి డబ్బులు వాపసు చేస్తామని వాట్సాప్ గ్రూప్‌లో తాపీగా వెల్లడించింది. ఈ బస్సులన్నీ 100 శాతం రిజర్వ్ అయినవే! దీంతో టికెట్లు రిజర్వ్ చేసుకున్న దాదాపు 5వేల మంది ఓటేసేందుకు ఎలా వెళ్లాలి దేవుడా? అంటూ తలలు పట్టుకుంటున్నారు. కాగా.. మరో ట్రావెల్స్ ఏజెన్సీకి చెందిన 10 సర్వీసులు కూడా రద్దయ్యాయి. ఏపీ-తెలంగాణల్లో బస్సులు నడిపే లైసెన్స్ లేదని, ఆ ట్రావెల్స్ కేవలం ఏపీలోనే సర్వీసులు నడుపుకోవాలని తెలంగాణ ఆర్టీఏ ఆదేశించడంతో ట్రావెల్స్ యాజమాన్యం ఆ బస్సులను రద్దు చేసింది. దీంతో సకాలంలో ఏపీకి వచ్చి ఓటేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆంధ్రా ఓటర్లు ఆందోళన చెందుతున్నారు.
గురువారం (11వ తేదీ) ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కోసం హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోని ఆంధ్రా ప్రజలు టీఎస్ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లోనూ సీట్లను రిజర్వ్ చేసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఏపీకి నడిచే ఆరెంజ్, మార్నింగ్ స్టార్, దివాకర్, వీరభద్ర వంటి ట్రావెల్స్‌తో పాటు కావేరి ట్రావెల్స్‌లోనూ టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే కావేరి ట్రావెల్స్ ఒకేసారి 125 బస్సులను రద్దు చేయడంతో ఇప్పుడు వారంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కాగా.. తెలంగాణలో బస్సులు రద్దవుతున్న నేపథ్యంలో ఏపీఎ్‌సఆర్‌టీసీ అప్రమత్తమైంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఈ నెల 10, 11 తేదీల్లో ఏపీకి సర్వీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
సరిపడా డ్రైవర్లు లేని కారణంగానే 10న ఏపీకి వెళ్లాల్సిన 125 బస్సులను రద్దు చేసినట్లు కావేరి సంస్థ చెబుతోంది. ఏపీలో పోలింగ్‌కు ఒక రోజు మాత్రమే ఉండడంతో అందుబాటులో ఉన్న బస్సుల్లో టికెట్ల చార్జీలు.. విమాన చార్జీలను తలపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖకు ఏసీ స్లీపర్ బస్సులో చార్జీ రూ.3700 వరకు ఉండగా.. విమాన చార్జీ రూ.5వేల వరకే ఉంది. బస్సు దొరక్కపోతే రైలులోనైనా వెళ్లొచ్చన్న వారికి వెయిటింగ్ లిస్ట్ నిరాశే మిగుల్చుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయి.. సంక్రాంతి సందడిని తలపిస్తోంది. ఏపీలో ఎన్నికల కోసం తాము 48 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణమధ్యరైల్వే చెబుతున్నప్పటికీ అవి సరిపోవడం లేదు.