ఈవీఎంల విశ్వసనీయతపై విపక్షాలు ఒకవైపు ఆందోళనలు చేస్తున్న సమయంలోనే.. వాటికి సంబంధించి విస్తుగొలిపే సంచలనాత్మక కథనాన్ని ‘ఫ్రంట్‌లైన్’ మేగజైన్ ప్రచురించింది! 1989-90 నుంచి 2014-15 మధ్య దాదాపు 19 లక్షల ఈవీఎంలు గల్లంతయినట్లు బాంబే హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం గురించి ముఖచిత్ర కథనంలో సవివరంగా వెల్లడించింది. ఆ కథనం ప్రకారం.. ముంబైకి చెందిన మనోరంజన్‌రాయ్ అనే సమాచార హక్కు కార్యకర్త 2018, మార్చి 27న.. ఈవీఎంల గోల్‌మాల్‌పై బాంబే హైకోర్టులో ఒక ప్రజాహితవ్యాజ్యం దాఖలు చేశారు. సమాచార హక్కు చట్టం కింద ఆయన సేకరించిన సమాచారం ప్రకారం ఈవీఎంల సేకరణ, నిల్వ, నియోగంలో స్పష్టమైన తేడాలున్నాయి. రూ.116.55 కోట్ల మేర ఆర్థిక అవకతవకలూ ఉన్నాయి.
2017, జూన్ 21న భారత ఎన్నికల కమిషన్ తెలిపినదాని ప్రకారం 1989-90 నుంచి 2014-15 నడుమ బీఈఎల్ సంస్థ నుంచి ఈసీ అందుకున్న ఈవీఎంల సంఖ్య 10,05,662. అయితే, ఆ సమయంలో తాము ఈసీకి సరఫరా చేసినవి 19,69,932 ఈవీఎంలని బీఈఎల్ 2018, జనవరి 2న ఒక సమాధానంలో తెలిపింది. 1989-90 నుంచి 2016-17 నడుమ ఈసీఐఎల్ నుంచి ఎన్నికల కమిషన్ అందుకున్నట్టు చెబుతున్న ఈవీఎంలు 10,14,644 కాగా.. ఆ సమయంలో తాము సరఫరా చేసిన ఈవీఎంలు 19,44,593 అని 2017, సెప్టెంబరు 16న ఈసీఐఎల్ సంస్థ ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా తెలిపింది. అంటే, రెండు సంస్థలూ కలిపి తాము సరఫరా చేసిన ఈవీఎంల సంఖ్య 39,14,525 అని చెబుతుండగా.. ఈసీఐ మాత్రం తమకు అందినవి 20,20,306 ఈవీఎంలేనంటోంది. తేడా 18,94,219 ఈవీఎంలు. 2014-15లో బీఈఎల్ 62,183 ఈవీఎంలు సరఫరా చేసినట్టు పేర్కొనగా.. ఈసీ రికార్డుల్లో అసలు ఒక్కటీ అందుకోలేదని ఉంది. ఈ ఆర్డర్-సరఫరా జాబితాను రాయ్ కోర్టుకు సమర్పించారు. ఈవీఎంల సరఫరాలోనే కాదు.. డబ్బుల చెల్లింపుల్లోనూ అవకతవకలు జరిగినట్టు రికార్డులు చెబుతున్నాయి.
2006-07 నుంచి 2016-17 నడుమ ఈవీఎంల కోసం రూ.536,01,75,485 చెల్లించినట్టు ఈసీ రికార్డుల్లో ఉండగా.. ఈసీ నుంచి రూ.652,56,44,000 అందుకున్నట్టు బీఈఎల్ పేర్కొంది. ఆ సంస్థ అధికంగా అందుకున్న సొమ్ము దాదాపు రూ.116.55 కోట్లు. ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నలకు జవాబుల ద్వారా బయటపడిన ఈ అవకతవకలపై మనోరంజన్‌రాయ్ గత ఏడాది మార్చిలో బాంబే హైకోర్టులో పిల్ వేశారు. మనోరంజన్ రాయ్ దాఖలు చేసిన పిల్ 2018 సెప్టెంబరు 19న తొలిసారి విచారణకు వచ్చింది. అటుపై, నాలుగు విచారణల అనంతరం.. 2019 మార్చి 8న ఈసీఐ సమాధానమిచ్చింది. అయితే, పిల్‌లో పేర్కొన్న స్పష్టమైన తేడాలకు సంబంధించి నిర్ణీత వివరాలు ఇవ్వకుండా.. ‘ప్రతి ఈవీఎం, వీవీప్యాట్‌కు యునిక్ సీరియల్ నంబర్ ఉంటుంది’’ అంటూ సాధారణ సమాధానాలే ఇచ్చింది. తదుపరి విచారణ సమయంలో పూర్తి వివరాలివ్వాలని ఏప్రిల్ 5న కోర్టు ఈసీఐని ఆదేశించింది. ఏప్రిల్ 23న తదుపరి విచారణ జరగ్గా ఈసీఐ స్పం దించలేదు. కోర్టు తదుపరి విచారణను జూలై 17కు వాయిదా వేసింది. దీంతో.. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని మనోరంజన్‌రాయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.