ఒకవైపు ఇంద్రకీలాద్రి.. అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ దేవాలయం.. ఇంకోవైపు ఉండవెల్లిగుహలు.. మూడో పక్క అద్భుత కట్టడం ప్రకాశం బ్యారేజీ.. నడుమ భవానీ ద్వీపం.. పర్యటకుల మనసు ఉల్లాసానికి ఇంతకంటే ఏం కావాలి..? కానీ ఆ పర్యటక ప్రాంతం అంతర్జాతీయ సొబగులు దిద్దుకొంటోంది... కృష్ణా నదిలో ఉన్న భవానీ ద్వీపాన్ని అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా మార్చాలన్న చంద్రబాబు ఆలోచనకు తగ్గట్టు, టూరిజం శాఖ రంగంలోకి దిగింది... వినోద, విహార కేంద్రమైన భవానీ ద్వీపాన్ని మరింత సుందరంగా తీర్చి దిద్దేందుకు కార్యాచరణ ప్రణాళికలు దగ్గరే ఇన్నాళ్ళు కాలం గడిచిపోయేది... కాని, ఇప్పుడు కార్యాచరణతో పటు, పనులు కూడా అంతే వేగంగా జరుగుతున్నాయి...
ఇప్పటికే ఒడ్డున నీటిపై తేలియాడే లేజర్‌షో, వాటర్ ఫౌంటేన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పిల్లలతో సహా ద్వీపానికి వచ్చే వారిని ఆకట్టుకునేలా వివిధ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు సరదాగా గడిపేలా వివిధ రకాల ఆట పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. గతంలో ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో కొన్ని రకాల ఆట పరికరాలు మాత్రమే ఉండేవి. వాటిని వినియోగించుకోవాలంటే అధిక ధరలు వసూలు చేసేవారు. ప్రస్తుతం బీఐటీఎస్ ఆధ్వర్యంలోనే చిన్నారులు, పెద్దలు ఆటలాడుకునే విధంగా ప్రత్యేక ఉద్యాన వనాన్ని నిర్మించారు. అందులో ఊయలలు, జారుడు బల్లలు, పిల్లలతో కలిసి పెద్దలు ఊగే ఆట పరికరాలు తదితరాలను ఏర్పాటు చేశారు. వాటిని ఉచితంగా వినియోగించవచ్చు
అలాగే రెండు అద్భుతమై ప్రాజెక్ట్ ల పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.... ఇందులో భాగంగా మజ్ గార్డెను ఏర్పాటు చేయనున్నారు. ఈ మజ్ గార్డెన్ లోకి ఒక మార్గంలోంచి లోపలకు వెళ్లి తిరిగి బయటకు రావడానికి తికమకపడాల్సిందే. నాలుగు వైపుల నుంచి బయటకు వెళ్లేందుకు వీలుండటం, ఏ మార్గంలో వెళ్తున్నామో తెలియకపోవడంతో ఇందులోకి వెళ్లిన వారికి మజ్ గార్డెన్పై ఉత్సాహం కలిగిస్తుంది దాదాపు 80-80 మీటర్ల వెడల్పుతో ఆ గార్డెన్‌ను తీర్చిదిద్దుతున్నారు... ఇదే కాకుండా మిర్రర్ మజ్ ను ద్వీపంలో ఏర్పాటు చేస్తు న్నారు. ఈ మిర్రర్ మజ్ ఒక రకమైన మయసభ. అనేక అద్దాలు ఉండటంతో ఎక్కడైనా ఒక చోట నిలబడి చూస్తే అన్ని అద్దాల్లోనూ వారి ప్రతిబింబమే కనపడుతుంది. దీంతో అసలు వ్యక్తి ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం కొద్దిగా కష్టమే అవుతుంది. నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని, కొన్ని రోజుల్లోనే వాటిని కూడా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని బీఆర్‌టీఎస్ అధికారులు పేర్కొన్నారు.