ఇవాళ లక్ష గృహ ప్రవేశాలతో లక్ష కుటుంబాల కళ్లల్లో ఆనందం చూశానని, ఇది తన జీవితంలో మరపురాని రోజని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచ ఆవాస దినోత్సవం సందర్భంగా సోమవారం విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఎన్టీఆర్ లక్ష గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.

గ్రామీణ ప్రాంతాలలో 12 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ16 వేల కోట్లు వెచ్చిస్తున్నామని, పట్టణ ప్రాంతాలలో 5,40,000 గృహాల నిర్మాణానికి దాదాపు 33,000 కోట్లు వ్యయం చేస్తున్నామని, రెండూ కలిపి రూ.50 వేల కోట్లతో 17 లక్షల 40 వేల గృహాలను నిర్మించడం తమ లక్ష్యమని చంద్రబాబు వివరించారు. ఇళ్లు కట్టడం, పెళ్లి చేయడం కష్టమని అంటారని ముఖ్యమంత్రి చెప్పారు.

ఇదో శుభకార్యంగా భావిస్తూ, గృహప్రవేశాలు చేసిన లబ్దిదార్ల దంపతులకు రాష్ట్రం ప్రభుత్వం పక్షాన నూతన వస్త్రాలను బహూకరిస్తున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు. లబ్ది దారులను అభినందిస్తున్నామన్నారు. ఒకే రోజు లక్షగృహప్రవేశాలతో దేశంలోనే ఒక చరిత్ర సృష్టించినట్లు చంద్రబాబు వివరిచారు. గతంలో తాను చేపట్టిన పాదయాత్ర ద్వారా పేదవాళ్ల సమస్యలన్నీ తెలుసుకున్నానని.. వాటిని ఆర్ధిక సమస్యలు అధిగమిస్తూ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. విద్య, వైద్య రంగంలో పేదవాళ్ల ఖర్చు తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. పేదవారికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు.

ఒక్కపైసా అవినీతికి తావులేకుండా ఒకే రోజు లక్ష నూతన గృహాల ప్రారంభోత్సవం చరిత్రాత్మకమైనదని చంద్రబాబు నాయుడు అన్నారు. ఎవరైనా సరే మంజూరులో కానీ, బిల్లు ఇచ్చే సందర్భంలో లంచం అడిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అలా ఎక్కడైనా జరిగితే 1100 కాల్ సెంటర్ కు ఫోన్ చేసి తమ దృష్టికి తేవాలని ముఖ్యమంత్రి కోరారు.

గతంలో గృహనిర్మాణాల పేరుతో వేల కోట్ల రూపాయలు స్వాహా చేశారని విమర్శించారు. అలాంటి అవినీతి, అక్రమాలకు తాము నిరోధించామని, పూర్తి పారదర్శకంగా వ్యవహరించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు ‘మీకు చేతనైతే మరో 10 రూపాయలు అదనంగా ఇచ్చి ఇళ్లు ఇంకా మంచిగా నిర్మించాలి. అండగా ఉండాలి. చేయూతనివ్వాలి. అంతే తప్ప ఏరకంగానూ, ఎక్కడా అవినీతికి జరగడానికి వీలు లేదు’ అని ముఖ్యమంత్రి అన్నారు. బిల్లుల మంజూరు సందర్భంగా లబ్దిదారుల సమాచారం తాను తీసుకుంటానని, లబ్దిదారులు నిర్మొహమాటంగా తన దృష్టికి తేవాలన్నారు. అవినీతికి పాల్పడితే ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏ స్థాయిలో కూడా పైసా అవినీతికి తావు లేదని అన్నారు. ప్రతి ఇంటినీ జియో ట్యాంగింగ్ చేస్తున్నామని, ఛాయాచిత్రాలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఇవాళ లక్ష ఇళ్లు పూర్తయితే గృహ ప్రవేశాలు చేయించామని, వచ్చే క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు లక్ష, తాను ప్రమాణ స్వీకారం చేసిన వచ్చే జూన్ 8వ తేదీన మరో లక్ష ఇళ్లను ప్రారంభించి లబ్దిదారులకు అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read