ఆకుపచ్చ కోక కట్టిన నేలతల్లి! కనువిందు చేస్తోంది! ఏ కోనసీమలోనిదో కాదు! కృష్ణా డెల్టాలోనిదీ కాదు! ఒకప్పుడు ఫ్యాక్షన్తో అట్టుడికిన ప్రాంతం.. కక్షలతో ఉక్కిరిబిక్కిరై..ఊళ్లకుఊళ్లు ఖాళీ అయిన జిల్లా. ఒకవైపు కరువుకాటు మరోవైపు ఫ్యాక్షన్ గొడవలు. ఉపాధి కోసం సొంతూరును వదిలి వలసవెళ్లిన జీవితాల్లో మార్పు కనిపిస్తోంది. కొన్నేళ్ళుగా కరువు కోరల్లో ఉన్న అనంతపురం, ఈ సంవత్సరం నీళ్ళతో కళకళలాడింది... అవును 2017 జిల్లా చరిత్రలో లిఖించదగిన సంవత్సరం. దేవుడి కరుణకు తోడు.. పాలకుల శ్రమ ఫలించడంతో జిల్లాలో కృష్ణమ్మ బిరబిరామంటూ పరుగులు పెట్టింది. పాతాళ గంగమ్మ గలగలమంటూ పైకి ఉబికి వచ్చింది. తుంగభద్ర ఎగువ కాలువ (టీబీ హెచ్చెల్సీ), హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) ప్రాజెక్టులు జిల్లాకు వరంగా మారాయి. ..
రైతుకు నీళ్లిస్తే పొలంలో బంగారం పండిస్తాడు! తాను బతుకుతూ... పది మందిని బతికిస్తాడు! దేశం ఆకలి తీరుస్తాడు! ఇది అక్షరాలా నిజమని అనంతపురం జిల్లా రైతులు నిరూపిస్తున్నారు. నీరు ఇచ్చిన అండతో పచ్చటి పైరు పండిస్తున్నాడు. దీనంతటికీ బీజం... పట్టిసీమలో పడింది. పట్టిసీమ ద్వారా ఈ ఏడాది తొలిసారిగా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తీసుకురావడం తెలిసిందే. ఆ మేరకు శ్రీశైలం నుంచి కిందికి వెళ్లాల్సిన నీటిని రాయలసీమ జిల్లాలకు మళ్లించారు. హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు నీటిని పంపి.. అక్కడి నుంచి అనంతపురం జిల్లాలోని పశ్చిమ భాగంలో చెరువులను నింపారు...
ఇవి ఒక వైపు, మరో వైపు దేశంలోనే అతి పెద్ద ఫారన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తో, కియా కార్ల పరిశ్రమ అనంతపురం వచ్చింది. పారిశ్రామికంగానూ జిల్లా దశ తిరిగింది. 600 ఎకరాల్లో 13 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో కార్ల తయారీ పరిశ్రమ పనులు శరవేంగంగా సాగుతున్నాయి. దీనికి అనుబంధంగా పదుల సంఖ్యలో పరిశ్రమలు వెలుస్తున్నాయి. రాప్తాడు సమీపంలో "జాకీ" దుస్తుల పరిశ్రమ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. సోమందేపల్లి, గోరంట్ల, హిందూపురం పరిసర ప్రాంతాల్లో భారీ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. వీటన్నిటికి అంకురార్పణ జరిగింది 2017 సంవత్సరమే కావడం విశేషం.మొత్తంగా 2017 సంవత్సరం జిల్లాకు కలిసొచ్చిందనే చెప్పొచ్చు.