ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన అంశాల్లో తెలుగుదేశం చేపట్టిన ఆందోళన ఒక్కసారిగా పతాకస్థాయికి చేరుకొంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజునే తెలుగుదేశం ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ స్వీకరించడంతో ఒక్కసారిగా జాతీయ రాజకీయాలు వేడెక్కాయి. చంద్రబాబు రాజకీయ వ్యూహం ఫలించడంతో ఏపీ ప్రత్యేక హోదా జాతీయ స్థాయి చర్చకు నోచుకుందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకు ఈ అవిశ్వాస తీర్మానంతో ఎలాంటి ప్రమాదం లేదు. అవసరమైన మెజార్టీతో పాటు అన్నాడీఎంకే.. ఇతర పక్షాలు ఎన్డీయేకు మద్దతు ఇచ్చే అవకాశముంది. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోవచ్చు. అయినప్పటికీ పార్లమెంటు సాక్షిగా యూపీఏ-2 హయాములో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన ప్రత్యేక హోదా అంశం మళ్లీ తెరపైకి వస్తుంది. గత నాలుగేళ్లలో మోదీ ప్రభుత్వం ఏపీకి ఎంత సాయం అందించిందీ, ఏయే ప్రయోజనాలు ఇంతవరకూ అమలుకు నోచుకోలేదన్న విషయం ప్రధానంగా చర్చకొచ్చే అవకాశముంది.

తాజా రాజకీయ వ్యూహంలో చంద్రబాబునాయుడు ఏకంగా ఒక దెబ్బకు నాలుగు పిట్టల్ని కొట్టారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వైకాపాపై పైచేయి, రాష్ట్రంలో భాజపాను ఏకాకి చేయడం, పవన్‌కల్యాణ్‌ సారథ్యంలోని జనసేన విమర్శలకు బదులివ్వడం, జాతీయ రాజకీయపక్షమైన కాంగ్రెస్‌తో పాటు ఇతర పక్షాలను ఎన్డీయేకు వ్యతిరేకంగా ఒక తాటిపైకి తీసుకొని రావడం... ఈ నాలుగు అంశాలతో దేశ రాజకీయాల్లో తెలుగుదేశం కీలకభూమికను పోషించనుందన్న సంకేతాలు వెళ్లాయి. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అంశంపై వైకాపా గత లోక్‌సభ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానానికి యత్నించింది. అయితే పలు కారణాల వల్ల స్పీకర్‌ స్వీకరించేలేదు. ఏకంగా వైకాపాకు చెందిన ఐదుగురు లోక్‌సభ సభ్యులు తమ రాజీనామాలను సమర్పించి ఆమోదింపచేసుకున్నారు. అయితే తాజా లోక్‌సభ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌ అంశం అవిశ్వాస తీర్మానం రూపంలో చర్చకు రానుండటంతో వైకాపా సభ్యులు లేకపోవడంతో వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం కోల్పోయారు.

గత ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కలసి కట్టుగా పోటీచేశాయి. అనంతరం బీజేపీ తీసుకున్న నిర్ణయాలు తెలుగుదేశాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. హోదా లేకపోయినా ప్యాకేజీ నిధులతో పాటు విశాఖ రైల్వే జోన్‌, కడప ఉక్కు కర్మాగారం, పోలవరం ప్రాజెక్టు.. తదితర అంశాలపై బీజేపీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సిన అవసరం తెదేపాపై పడింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్డీయేకు రాంరాం చెప్పింది. బీజేపీ పై పోరుబాట పట్టి, ఇప్పుడు పతాక స్థాయికి తీసుకువెళ్ళింది. ఇక పవన్ విషయానికి వస్తే, ప్రత్యేకహోదాపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే తాను మద్దతు కూడగడుతానంటూ ప్రకటించారు. ఇప్పుడు తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో పవన్‌ విమర్శలకు దీటైన జవాబిచ్చినట్టయింది. తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధిగా పోరాడుతున్నామని రాష్ట్ర ప్రజలకు తెదేపా తెలియపరిచినట్టయింది.

రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్న అంశాన్ని దేశప్రజల దృష్టికి తీసుకురావడంలో తెలుగుదేశం విజయం సాధించింది. అప్పట్లో రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్‌ కూడా తప్పనిసరిగా అవిశ్వాస తీర్మానానికి మద్దతుపలికే పరిస్థితి తీసుకువచ్చింది. తెదేపాకు సంఖ్యాబలం లేనప్పటికీ కాంగ్రెస్‌, ఎన్‌సీపీలు అవిశ్వాస తీర్మానానికి వెంటనే తమ మద్దతు ప్రకటించాయి. అవిశ్వాసం వీగిపోయే పరిస్థితులున్నప్పటికీ పార్లమెంటులో చర్చ ద్వారా రాష్ట్రానికి జరిగిన అన్యాయాలపై దేశప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం సిద్ధమవుతోంది. (సేకరణ ఈనాడు )

Advertisements

Advertisements

Latest Articles

Most Read